-
ఒలింపిక్స్ లో ఇండియా టీమ్ డ్రెస్ లపై వివాదం
-
క్రీడాకారుల దుస్తులు దారుణంగా ఉన్నాయన్న జ్వాల
ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మహిళా షూటర్మను భాకర్ కాంస్య పతకాన్ని గెలిచింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఇండియాఅకౌంట్ తెరిచినట్లైంది. మరోవైపు స్టార్ షట్లర్ పీవీ సింధు, హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ సైతం తొలి రౌండ్ మ్యాచులను దాటుకుని మరో రౌండ్ లోకి వెళ్లారు. ఇదంతా బాగానే ఉన్నా..ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల డ్రెస్ లపై వివాదం నెలకొంది.
పారిస్ లోఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు ధరించిన చీరపై ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఇప్పుడు మళ్లీభారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సైతం క్రీడాకారుల దుస్తులపై కామెంట్స్ చేశారు. భారత క్రీడాకారుల దుస్తులు మరీ నాసిరకంగా ఉన్నాయని గుత్తా జ్వాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
ఒలింపిక్స్ లో పాల్గొనే టీమ్ ఇండియా కోసం దుస్తులు డిజైన్ చేసిన వారిపై భారీ అంచనాలు ఉండేవని చెప్పిన గుత్తాజ్వాల.. కానీ ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల కోసం తయారు చేసిన దుస్తులుమాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాకపోవచ్చన్న జ్వాల.. డిజైనర్లు ఈ విషయాన్ని ఎలా ఆలోచించలేకపోయారని ప్రశ్నించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ ద్వారా మన ఆర్ట్స్ ను ప్రదర్శించడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ డిజైనర్లు ఆపని చేయలేదని వాపోయారు. భారత క్రీడాకారుల దుస్తులు ఏమాత్రం సౌకర్యంగా లేవని.. ఇప్పటికైనా దుస్తుల నాణ్యత విషయంలో శ్రద్ద పెట్టాలని సూచించారు గుత్తా జ్వాల.