– మధుమేహానికి అదనంగా గుండె జబ్బులు కూడా
– 2020లో నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం కూల్‌డ్రింక్స్ వల్లే
పార్టీ అంటే చాలు ముందు గుర్తొచ్చేది కూల్‌డ్రింక్.. బిర్యాని. ప్రస్తుతం ఇదొక పెద్ద ఆనవాయితీ అయిపోయింది. పుట్టినరోజు… పెళ్ళిరోజు.. పండుగ,.. ఫంక్షన్ ఏదైనా కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే. అందులోనూ అది వేసవికాలమా.. చలికాలమా అని చూడడం లేదు. కూలడ్రింక్ తాగాల్సిందే అంటున్నారు నేటి తరం. బిర్యాని తింటూ కూల్‌డ్రింక్ సిప్ చేస్తే అబ్బా… ఆ టేస్టే వేరప్పా అంటున్నారు మన భోజన ప్రియులు. ఏ ఇద్దరు కలిసినా కూల్‌డ్రింక్ కడుపులోకి వెళ్లాల్సిందే. ఇక ప్రయాణాల్లో వాటి వినియోగం గురించి చెప్పక్కర్లేదు. శీతల పానీయాలను అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడుతుందన్న విషయం తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం కూల్‌డ్రింక్ పేరెత్తడానికే భయపడిపోతారు.
శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడుతున్నారట. అంతేకాదు, 12 లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం మంది తీపి పానీయాలు తీసుకోవడం వల్లే దీని బారినపడినట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. మరి కనీసం ఇకనైనా కూల్‌డ్రింక్స్ తాగడం ఆపితే బావుంటుంది మరి.