ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన దుర్ఘటనలో గ్రేహౌండ్స్ బలగాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు బలగాలు వెళ్లగా వాజేడు బీజాపూరం అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సమయంలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీజీపీ కూడా మరికాసేపట్లో వరంగల్ రానున్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం.
17వ రోజు కొనసాగుతున్న కూంబింగ్ : పోలీసులు గ్రేహౌండ్స్ బలగాల రాక తెలుసుకుని మావోయిస్టులు పక్కా వ్యూహంతో ఐఈడీ పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కర్రెగుట్టల్లో బలగాలు గత 17 రోజులుగా ముమ్మర కూంబింగ్ జరగుతోంది. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. తప్పించుకుపోయిన మరికొంత మంది వెంకటాపురం, వాజేడు అటవీ ప్రాంతం వైపు రావచ్చన్న సమాచారంతో ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ బృందాలు కూడా వెళుతుంటాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను ఏరివేసే క్రమంలో బలగాలు ఇప్పటివరకూ పై చేయి సాధించగా అనుకోని రీతిలో ఈ ఘటన జరిగింది.