- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- సరకుల నాణ్యతపై దృష్టిపెట్టండి
- అధికార్లకు సీఎస్ రామకృష్ణారావు నిర్దేశం
తెలంగాణలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ కె రామకృష్ణారావు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి దేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల చెల్లింపులను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.
అదేవిధంగా డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్ధులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని సిఎస్ పేర్కొన్నారు. విద్యార్ధులకు సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని కోరారు. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడ నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పెట్లు, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సరుకుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సిఎస్ రామకృష్ణారావు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ డెవలప్‌మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శి ఎ వర్షిణి, సెర్ఫ్ సీఈఓ దివ్య, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఈ శ్రీధర్ పాల్గొన్నారు.