అద్దె వాహనానికి రూ.61 లక్షలు వసూల్
ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులుగా ఉంటూ.. వారు చేసే కొన్ని పనుల కారణంగా అపఖ్యాతి పాలవుతుంటారు. అలాంటి వ్యవహారమే తాజాగా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్ కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. విద్యార్థులు ఉత్తమంగా బోధనలు చేసేందుకు, పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వర్శిటీ నిధుల నుంచి తన కారు అద్దె కోసం ఏకంగా రూ.61 లక్షలు వాడుకున్నారు. దాదాపు ఏడున్నర ఏళ్ల పాటు అంటే 90 నెలల పాటు కారు అద్దె కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నుంచి ఈ నిధుల్ని తీసుకున్నారు. అయితే, కారు కోసం తీసుకున్న ఈ నిధులపై ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్శిటీలో నిర్వహించిన ఆడిట్ లో స్మితా సభర్వాల్ వినియోగించుకున్న నిధుల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అధికారులు అభ్యంతరం తెలపడంతో.. నీళ్లు నమిలిన అధికారులు, ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆవిడ వినియోగించిన ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధుల్ని తిరిగి ఇచ్చేయాలని, యూనివర్శిటీ ఖాతాకు జమ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొననున్నారు. ఈ విషయమై ఒకటి, రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని వర్శిటీ అధికారులు వెల్లడించారు.
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పర్యాటక శాఖకు వచ్చిన స్మితా సభర్వాల్.. అంతకు ముందు ప్రభుత్వంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో పనిచేశారు. ఆ సమయంలోనే 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు.. నెలకు రూ.63 వేల చొప్పున కారు అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి నిధుల్ని స్మితా తీసుకున్నారు. వర్శిటీ నిధుల్ని అలా వినియోగించడం నిబంధనలకు విరుద్ధం అని తేల్చిన అధికారులు.. వాహనం అద్దె పేరిట 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ శాఖ తీవ్రంగా తప్పుబడుతోంది.
ఆ వాహనం ఎవరిది.?
సీఎంవో అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్ 08 ఈసీ 6345 వాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ప్రైవేటు వ్యక్తికి చెందిన వ్యక్తిగత వాహనం కేటగిరికి చెందింది. ఈ వెహికిల్ పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో అధికారులు గుర్తించారు. నిధుల కోసం ప్రతీ నెల సీఎంవో లోని స్మితా ఆఫీసు నుంచి రశీదు వచ్చేదని.. దాంతో ఆ చెల్లింపుల్ని వర్శిటీ చేపట్టినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. హోదాను అడ్డు పెట్టుకుని చట్టవిరుద్ధంగా, నిబంధనల్ని పాటించకుండా స్మితా సభర్వాల్ నిధుల్ని వినియోగించడాన్ని అధికారులు తప్పబడుతున్నారు. హోదా మరింత గౌరవాన్ని తీసుకురావాలి కానీ, అగ్రికల్చర్ యూనివర్శిటీ నిధుల్ని అలా ఎలా వినియోగిస్తారంటూ.. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
వర్శిటీ తీరుపైనా అనుమానాలు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పాలనా తీరుపై, అంతర్గాత వ్యవహారాలపై అనేక విమర్శలున్నాయి. ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు సైతం బయటపడ్డాయి. వర్శిటీలోని లోపాలు, నిర్లక్ష్యంపై నిర్వహించిన సమీక్షలో.. స్మితా సభర్వాల్ కు నిబంధనలకు విరుద్ధంగా అందజేసిన నిధుల వ్యవహారమూ ఉంది. ఈ విషయంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య.. ఆడిట్ శాఖ అభ్యంతరం నిజమేనని తెలిపారు.