వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు
అన్ని సంఘాల నాయకులతో సమావేశం
ఈ రెండు పెన్షన్‌లపై విస్తృతంగా చర్చ
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
పాత పెన్షన్ విధానమే కావాలంటూ ఉద్యోగులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో యూపిఎస్ పెన్షన్ విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఎస్, యూపిఎస్ ఈ రెండు పెన్షన్ విధానాలు వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ భవిష్యత్ కార్యాచరణ, విస్తరణ, తదితర అంశాలపై జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని 33 జిల్లాలలోని అన్ని శాఖల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సంఘాల నాయకులను ప్రత్యక్షంగా కలువనున్నట్టుగా లచ్చిరెడ్డి తెలిపారు.
జేఏసీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, తదితర అంశాలపై స్థానిక ఉద్యోగ, ఉపాద్యాయ, మిగతా సంఘాల నేతలతో విస్తృతంగా చర్చించనున్నట్టుగా ఆయన చెప్పారు. కొత్తగా కేంద్రం తెస్తామన్న యూపిఎస్, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సిపిఎస్ ఈ రెండు పెన్షన్ విధానాలు వద్దని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరేందుకు జేఏసీ ప్రతినిధులు శనివారం ఉదయం 9గంటలకు ప్రజా భవన్‌కు వెళ్లి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాములు, కె.రామకృష్ణ, గోపాల్, రమాదేవి, దర్శన్‌గౌడ్, కత్తి జనార్ధన్, ప్రగతికుమార్, ఎస్.రాములు, నిర్మల, సంపత్‌కుమారస్వామి, మేడి రమణ, తదితరులు పాల్గొన్నారు.