Thursday, January 16, 2025

టీజీఐఐసీ భూమికి రాజకీయ గ్రహణం

  • సర్కార్ అమ్మిన భూమిలో అధికారుల కూల్చివేత‌లు!
  • నిర్మాణాల‌కు అనుమతులివ్వరు-మ్యుటేషన్ చేయరు
  • పైన కలవమంటూ ఉచిత సలహాలు
  • హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
  • కోర్టు ఆదేశాలు బేఖాతర్.. తెర వెనుక ఆ చీకటి నేత ఎవరు ?
  • టీజీఐఐసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

ఒకప్పుడు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు  పలువురు పారిశ్రామికవేత్తలు  ముందుకొచ్చినా అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి. తమ వద్ద పెట్టుబడులు పెట్టండంటూ గత ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులు సులభతరం చేసే దిశగా టీఎస్ఐపాస్ ప్రారంభించింది. టీఎస్ ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) పేరు ప్రపంచ పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా  చెప్పుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం.. టీజీఐఐసీలో  పేరుకుపోయిన అవినీతి తిమింగలాలను మాత్రం అలాగే వొదిలేసింది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ అనుమతుల కోసం టీజీఐఐసీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన  పరిస్థితి కొనసాగుతూనే ఉంది.  తాజాగా పటాన్ చెరు పారిశ్రామికవాడ ఫేజ్ 2లో పరిశ్రమ స్థాపన కోసం 15 ఎకరాలు కొనుగోలు చేసిన ఓ పారిశ్రామికవేత్తకు టీజీఐఐసీ అధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

పటాన్ చెరు ఐడీఏ ఫేజ్- 2 లో 833, 834, 836, 837, 838 సర్వే నంబర్లలో  లక్ష్మీ క్లే, సాయి ఆటోమేటిక్ బ్రిక్స్ లకు చెందిన 25.14 ఎకరాల భూమిని  1993, జూలై  17న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్  (ఎపిఎస్ఎఫ్ సీ) నుంచి యాక్షన్ ద్వారా ఎంఎస్ లైట్ క్రియేట్ కన్‌స్ట్రక్షన్  ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. తర్వాత వీరి నుంచి ఎంఎస్ శ్రీనిధి ఇండస్ట్రీస్ యాజమాన్యం 11 మే 2006లో 15.04 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకోసం అప్పట్లో ఏపీఐఐసీ 2006 ఫిబ్రవరి 3న సంగారెడ్డి సబ్ రిజిస్టార్ కు 15.14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఎన్వోసీ కూడా అందజేసింది. అనంతరం మ్యుటేషన్ కోసం పటాన్‌చెరు టీజీఐఐసీ కార్యాలయం గడప తొక్కిన ఎంఎస్ శ్రీనిధి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి అప్పటి జోనల్ మేనేజర్ దరఖాస్తు సక్రమంగా సమర్పించాలని చెప్పడంతో సదరు శ్రీనిధి యజమాన్యానికి విషయం అర్థం కాలేదు. అనంతరం మరోసారి మ్యుటేషన్ కోసం పటాన్ చెరు టీజీఐఐఐసి కార్యాలయంలో సంప్రదించగా పై అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారని శ్రీనిధి యజమాన్యం తెలిపింది. తాము హైదరాబాద్ టీజీఐఐఐసి ప్రధాన కార్యాలయంలో సంప్రదించగా అక్కడ కూడా పై వాళ్ల‌తో మాట్లాడుకోమని సమాధానం వొచ్చిందని, అక్కడ పై వాళ్ళు ఎవరో తమకు అర్థం కాలేదని శ్రీనిధి యాజమాన్యం తెలిపింది.

ఈ మేరకు గతేడాది 29 మే నెలలో తమ భూమి రక్షణ కోసం బేస్మెట్, ఫెన్సింగ్  నిర్మించాల‌ని అనుకుంటున్నామ‌ని, ఇందుకోసం టీజీఐఐసీ దరఖాస్తు చేశామని, కానీ టీజీఐఐసీ నుంచి స్పందన కరువైంద‌ని స‌ద‌రు యాజ‌మాన్యం పేర్కొంది. పైగా పలుమార్లు టీజీఐఐసి సిబ్బంది సంబంధిత భూమిలోకి ప్రవేశించి  శ్రీనిధి యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేయటంతోపాటు తమ భూమిలో ఈ భూమి టీజిఐఐసికి చెందినద‌ని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయడంపై  హైకోర్టును ఆశ్రయించింది. టీజీ ఐఐసీ తరపు న్యాయవాది తాము ఎటువంటి ఇబ్బందులు క‌లిగించ‌లేద‌ని హైకోర్టులో వాదించారు.  గత సంవత్సరం డిసెంబర్ 11, 18వ‌ తేదీల్లో జోనల్ మేనేజర్ తన సిబ్బందితో వొచ్చి ప్రహరీని కూల్చివేయడం, ఈ విషయంలో జోనల్ మేనేజర్ అత్యుత్సాహం చూపడంతో శ్రీనిధి సంస్థ యజమానులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో టిజిఐఐసీ ప్రతినిధిని అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండి హైకోర్టు ఆదేశాలు ఉండగా ఎందుకు కూల్చివేశారిన‌  ప్రశ్నించింది. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో శ్రీనిధి ప్రతినిధులు సమర్పించిన డాక్యుమెంట్లు నిశితంగా పరిశీలించిన అధికారులు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, కోర్టు ఆదేశాలుండగా ఎలా కూలగొట్టారని న్యాయస్థానం  ప్ర‌శ్నించింది.  తమని ప్రొటెక్షన్ అడిగిన టీజీఐఐసి అధికారులు.. తాము రాకుండానే కూలగొట్టడం వెనక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా టీజీఐఐసి అధికారులను పటాన్ చెరు పోలీసులు,  శ్రీనిధి ప్రతినిధులు కోరినా లంచ్ తర్వాత వొస్తామని చెప్పి రాకపోవడం గమనార్హం.

కాగా రాజకీయ ఒత్తడి ఉందని పలువురు చెప్పడం వెనుక చీకట్లో ఉన్న ఆ రాజకీయ నేత ఎవరో చెప్పాలని శ్రీనిధి సంస్థ యజమానులు ప్రశ్నిస్తున్నారు. తమకు మ్యుటేషన్ పూర్తయి అనుమతులు లభిస్తే ఈపాటికి తాము స్థాపించిన పరిశ్రమ ద్వారా పలువురు స్థానికులకు ఉపాధి లభించేదని శ్రీనిధి యాజమాన్యం తెలిపింది. పరిశ్రమల స్థాపన కోసం ముందుకొచ్చే వారిని ఈ విధంగా సతాయిస్తే భవిష్యత్‌లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకెవరూ ముందుకు రారని వారు వాపోయారు. బేస్మెట్, ఫెన్సింగ్ విషయంలో టిజిఐఐసి అనుమతులు ఇవ్వకపోగా, శ్రీనిధి యజమాన్య స్థలంలోకి ప్రవేశించి ఇబ్బందులకు గురి చేయొద్దని  హైకోర్టు చెప్పినా అధికారులు తమ వైఖరి విడనాడకుండా యథాతథ‌గా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని  పూర్తి ఆధారాలతో తాము హైకోర్టుకు జరిగిన విషయాన్ని వివరిస్తామని స్ప‌ష్టం చేస్తున్నారు. కాగా మరోమారు బేస్మెంట్, ఫెన్సింగ్ లను కూల్చివేయాల్సిందిగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. కానీ ఇందుకు స్థానిక అధికారులు నిరాకరించారని కోర్టు ఉత్తర్వులు ఉన్నందున తాము ముందుకు వెళ్లలేమని ప్రధాన కార్యాలయం నుంచి ఎవరైనా వొస్తే తాము వెనకాల ఉండగలుగుతామని చెప్పినట్లు సమాచారం.

25 ఎక‌రాల‌కు మాత్ర‌మే డ‌బ్బు చెల్లించారు.. : టిజీఐఐసీ జోనల్ మేనేజర్
దీనిపై పటాన్‌చెరు టిజీఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్‌ను వివరణ కోరగా 120 ఎకరాలు అప్ఫటి ఏపీఐఐసీ విక్రయించగా 25 ఎకరాలకు మాత్రమే డబ్బు చెల్లించారన్నారు. డబ్బు చెల్లించని మిగతా భూమి కేటాయింపులు రద్దు చేశామని ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచామన్నారు. కాగా శ్రీనిధికి సంబంధించిన భూమి విషయంలో సబ్ డివిజన్ చేసుకోవాలని అందుకే అభ్యంతరం తెలుపుతున్నామని తెలిపారు. కాగా 2006లోనే ఈ భూమికి సబ్ డివిజన్ అయ్యింది కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మళ్లీ సబ్ డివిజన్ చేసుకోవాలని చెప్పారు. గతంలో శ్రీనిధి యజమాన్యానికి ఎన్‌వోసి ఎలా ఇచ్చారని ప్రశ్నించగా అప్పట్లో అధికారుల తప్పిదమ‌ని ఆయన పరోక్షంగా అంగీకరించారు. శ్రీనిధి యజమాన్యం భూమిపై అందరి దృష్టి ఉందని చెబుతూనే మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని చెప్పడం కొసమెరుపు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com