-
పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల
-
రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం
పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేశారు. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు జమ కానుది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. అయితే రీషెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించదు. ఈ రుణమాఫీ ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఇసిఎస్‌లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు, ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకోబడుతుంది.
కీలకమైన మార్గదర్శకాలివే..
- తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
- ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
- తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు.. వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- 12.12.2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
- రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నగు వారు ఉంటారు.
- అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్దిదారుల రైతు రుణఖాతాలకు జమ చేయబడుతుంది. పీఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
- ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి.
- ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
- ఏ కుటుంబానికి అయితే రూ. 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రూ. 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
- రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.