- దేవాలయాల్లో వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలి
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన
- చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను గురువారం కలిశారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్న అర్చకుల సమస్యలను డిప్యూటీ సిఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. భద్రాద్రి, వేములవాడ, బాసర వంటి ప్రాచీన దేవాలయాల్లో వారసత్వ అర్చకుల సమస్యలు ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిప్యూటీ సిఎంను ఆయన కోరారు. ఆయా దేవాలయాల్లో వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని రంగరాజన్ విన్నవించారు. వారసత్వ అర్చకత్వానికి సంబంధించి 1996లో డాక్టర్ ఎంవి సౌందరరాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
వారసత్వ అర్చకత్వానికి తిలోదకాలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలతో పాటు కొన్ని ప్రముఖ ఆలయాలు మూతపడే ప్రమాదం ఉందని రంగరాజన్ డిప్యూటీ సిఎంతో తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చట్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 16 ఏళ్లవుతున్నా ఆ చట్టం తెలంగాణలో అమలు కాలేదని, ఆంధ్రప్రదేశ్ లో 2019లో జిఓ ఎంఎస్ 439ను విడుదల చేసి ప్రభుత్వం వేల మంది అర్చకుల కుటుంబాలకు బాసటగా నిలిచిందని ఆయన తెలిపారు.
తెలంగాణలో ఆ చట్టాన్ని అమలు చేయకపోగా దేవాదాయ శాఖ వారసత్వ అర్చకుల బదిలీకి పూనుకోవడం శోచనీయమని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. పే స్కేల్ అమలు చేయడమే పరిష్కారం అని చెబుతూ ప్రభుత్వాన్ని కొందరు అధికారులు తప్పదోవ పట్టించి అర్చకులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను తెరమరుగు చేస్తున్నారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు. రంగరాజన్ చెప్పిందంతా విన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే ఈ విషయమై అధికారులతో మాట్లాడతానని రంగరాజన్‌కు డిప్యూటీ సిఎం మాటిచ్చారు.