Thursday, December 26, 2024

శాస్త్ర పరిశోధనల్లో బయోలాజికల్ ల్యాబ్‌ల పాత్ర కీలకం

సిఎస్‌ఐఆర్ డైరక్టర్ జనరల్ కలైసెల్వీ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః దేశంలో శాస్త్ర పరిశోధనల్లో బయోలాజికల్ ల్యాబ్‌ల పాత్ర చాలా కీలకమని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) డైరక్టర్ జనరల్ డా.ఎన్.కలైసెల్వీ అన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయోలాజికల్ పరిశోధన సంస్థ (సిసిఎంబి) చేపట్టిన పరిశోధనలు, వాటి ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చాయని అన్నారు. ఇటువంటి పరిశోధన సంస్థల ద్వారా మరిన్ని అద్భుత పరిశోధనలు చేపట్టి నేటి యువ పరిశోధకులు రాణించాలని కోరారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), సిసిఎంబి ఆవరణలో రూ.5 కోట్ల సిఎస్‌ఐఆర్ నిధులతో నిర్మించిన పిఎం భార్గవ ఆడిటోరియంను కలైసెల్వీ సోమవారం సిసిఎంబి డైరక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి, ఐఐసిటి డైరక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌జిఆర్‌ఐ డైరక్టర్ డాక్టర్ ప్రకాష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలైసెల్వీ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఐఐసిటి, సిసిఎంబిలు అందించిన శాస్త్రీయ సహకారం ఎంతో గొప్పదని అన్నారు. ‘సికిల్ సెల్ ఎనీమియా’ జన్యు కారక వ్యాధిపై సిసిఎంబిలో విస్త్రత పరిశోధన జరుగుతుందని అన్నారు. ఈ పరిశోధనల ఫలితాలు దేశానికి అందిన రోజు ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. ఇటువంటి సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లవేళలా సిఎస్‌ఐఆర్ అందిస్తుందని తెలిపారు. అనేక క్యాన్సర్ కారక అంశాలపై పరిశోధనలు చేసిన ఘనత సిసిఎంబికి ఉందని అన్నారు. అరుదైన జన్యుపరమైన రుగ్మతలకు అవసరమైన పరిశోధనలు సిసిఎంబిలో జరుగుతున్నాయని, సిసిఎంబి ఒక నోడల్ ల్యాబ్‌గా ఆమె అభివర్ణించారు.

మనం తినే బియ్యంలో గ్లైసిమిక్ ఇన్‌డెక్స్ తగ్గించే అనేక రకాల పరిశోధనలు పూర్తయి మంచి ఫలితాలు వచ్చాయని, అది సిసిఎంబి ఘనతేనని పేర్కొన్నారు. ఐఐసిటి, సిసిఎంబి సంస్థల మధ్య సమన్వయం, హృదకపూర్వక సంబంధాలు బాగున్నాయని ప్రశంసించారు. గాలి కాలుష్యంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ శాస్త్రపరంగా ఈ అంశానికి పూర్తిగా ఏమీ చేయలేమని, కాలుష్యానికి కారణమవుతున్న ఆయా సంస్థలు, ప్రభుత్వాలు మాత్రమే పటిష్టంగా చేస్తే ఎంతో కొంత వరకు ఫలితం ఉంటుందని అన్నారు. మహిళలను శాస్త్రీపరిశోధనల వైపు మళ్లించేందుకు అవసరమైన సహాయ సహకారాలను సిఎస్‌ఐఆర్ పరంగా అందిస్తున్నామని, గతంతో పోలిస్తే మహిళా పరిశోధకుల సంఖ్య గత కొన్నేళ్ల నుంచి పెరుగుతూ రావడమే ఇందుకు నిదర్శనమని కలైసెల్వీ పేర్కొన్నారు.

సిఐఎస్‌ఆర్‌కు తగినన్ని నిధులు లేవన్న మాట నిజం కాదని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు, సంస్థల నిర్వహణ, ఫెలోషిప్‌లకు అవసరమైన నిధుల కేటాయింపు ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం శాస్త్రీవారసత్వం కలిగి ఉందని, ఒకే పెద్ద రహదారికి పక్కన జాతీయ పరిశోధన సంస్థలు కలిగి ఉన్నందున ఈ కారిడార్‌కు ‘సైన్స్ కారిడార్’గా నామకరణం చేయాలని తాము మెట్రో రైల్ అధారిటీని కోరనున్నట్లు తెలిపారు. సిసిఎంబి, ఐఐసిటి, ఎన్‌జిఆర్‌ఐ, ఎన్‌ఐఎన్, జాతీయ ఫోరెన్సిక్ లేబొరెటరీ వంటి సంస్థలు ఒకే రోడ్డులో ఉన్నందున సైన్స్ కారిడార్‌గా పిలవడం ద్వారా శాస్త్రీయతకు పెద్ద పీట వేసినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఎంబి డైరక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి, ఐఐసిటి డైరక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌జిఆర్‌ఐ డైరక్టర్ డాక్టర్ ప్రకాష్‌కుమార్ పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com