- జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్ క్షమాపణలు
- ఎక్స్ వేదికగా వెల్లడించిన కమిషనర్
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈక్రమంలో మీడియా ఆయన్ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా.. నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్‌ట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరబాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు కోరుతున్నా‘ అని తెలిపారు.
ఇక ఈ ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.