- క్రైమ్ రేట్ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్
- బీఆర్ఎస్ హయాంలో నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన సైబర్ నేరాలు
- 2020తో పోల్చితే 2021లో అసాధారణంగా పెరిగిన నేరాల సంఖ్య
- ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో గతంలో నమోదు కాని కేసులు
- ప్రస్తుతం స్వేచ్ఛగా పని చేస్తున్న పోలీసు శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి… హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయంటూ నాలుగు రోజులుగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మొదలు ఆ పార్టీలోని చోటామోటా నేతలు గుండెలు బాదుకుంటున్నారు.. అందుకు వారు చూపుతున్న గణాంకాలన్నీ రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక ఆధారంగానే.. వాస్తవానికి గత పదేళ్లతో మరీ ముఖ్యంగా గత అయిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నేరాల పెరుగుదల శాతం స్వల్పమే… పోలీసు శాఖ విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే బీఆర్ఎస్ హయాంలోనే నేరాలు సంఖ్య ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో తెలిసిపోతుంది…
గత ప్రభుత్వ వైఫల్యంతోనే….
పోలీసు శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో 2020 (జనవరి నుంచి నవంబరు) నుంచి 2024 వరకు వరుసగా అయిదేళ్ల నేరాల గణాంకాలున్నాయి. ఇందులో 2020-2021 సంవత్సరాల్లో నమోదైన కేసులు బీఆర్ఎస్ హయాంలో అసాధారణంగా పెరిగిన నేరాలు ఘోరాలకు అద్దం పడుతున్నాయి.
ఉదాహరణకు…
2020లో ఆస్తుల కోసం హత్యలు 44 జరిగితే 2021లో అవి 85కు పెరిగాయి. అంటే దాదాపు రెండింతలయ్యాయి. దొంగతనాలు 2020లో 8,330 చోటు చేసుకుంటే 2021లో అవి 12,351కు పెరిగాయి. అంటే ఒక్క ఏడాదిలోనే 4 వేలకుపైగా దొంగతనాలు పెరిగాయి. హత్యలు 2020లో 660 జరిగితే 2021లో 838 జరిగాయి. ఏడాదిలోనే సుమారు 178 హత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. 2020లో 9,072 మోసాలకు సంబంధించిన కేసులు (ఛీటింగ్) నమోదైతే 2021లో ఏకంగా 14,666కు పెరిగాయి. అంటే ఏడాది కాలంలోనే 5 వేలకుపైగా అధికంగా కేసులు నమోదయ్యాయి. 2020లో సైబర్ నేరాలు 4,517గా ఉంటే 2021లో అవి ఏకంగా 8,826కు, 2022కు 13,895కు పెరిగాయి. అంటే బీఆర్ఎస్ పాలనా కాలంలో సైబర్ నేరాలు రెండేళ్లలో రెండు మూడింతలు అధికమయ్యాయి.
బీఆర్ఎస్ హయాంలోనే వరకట్నపు హత్యలు.. మహిళలపై వేధింపులు
బీఆర్ఎస్ పాలనా హయాంలో వరకట్నపు హత్యల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రాణాలు కోల్పోయారు.. 2020లో వరకట్నపు హత్యల్లో 42 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతే… 2021లో 33, 2022లో 40, 2023లో 33 మంది మహిళలు హత్యకు గురయ్యారు. 2024 వరకట్నపు ఈ హత్యల సంఖ్య 22కు తగ్గింది. గత అయిదేళ్లలో ఇదే అత్యల్పం.
వరకట్న వేధింపులతో మరణాలు బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వరకట్నపు సమస్యలతో 2020లో 44 మంది మహిళలు ప్రాణాలు కోల్పోగా… 2021లో ఆ సంఖ్య ఏకంగా 160కు పెరిగింది.. అంటే ఒక్క ఏడాదిలోనే ఈ క్రైమ్ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.. 2023లో 132 మంది మహిళలు బలవగా 2024 ఆ సంఖ్య 126కు తగ్గింది..
వరకట్నపు వేధింపుల విషయంలోనూ బీఆర్ఎస్ పాలనా కాలంలో మహిళలకు అఘాయిత్యాలు పెరిగిపోయాయి. 2020లో వరకట్నపు వేధింపుల కేసులు 6,544 నమోదైతే 2021లో ఆ సంఖ్య 8,429కు పెరిగింది. ఏడాదిలోనే 2 వేల కేసులు పెరిగాయి. నాటి నుంచి వరుసగా 2022లో అవి 9,071కు పెరగగా.. 2023లో ఏకంగా 9,458కి పెరిగాయి. 2024లో మాత్రం ఆ సంఖ్య 8,973కు పడిపోయింది.
సైబర్ బాధితులకు బాసటగా
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరోను బలోపేతం చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమర్థంగా పని చేస్తూ సైబర్ బాధితులకు బాసటగా నిలిచింది. సైబర్ నేరాల బారిన పడి డబ్బులు కోల్పోయిన వారికి 2023లో కేవలం రూ.8 కోట్లు తిరిగి ఇప్పించగలిగితే 2024లో రూ.180 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికవరీ చేసింది. 2023 రికవరీతో పోల్చితే ఇది 2,060 శాతం ఎక్కువ.
తగ్గిన రాజకీయ జోక్యం..
బీఆర్ఎస్ హయాంలో నడి రోడ్డుపైనే న్యాయవాద దంపతుల హత్య.. వాటిని వీడియో తీయడం.. పలు దారుణమైన హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. నేరాల సంఖ్య విచ్చలవిడిగా పెరగడంతో నాటి పాలకులు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా కేసులు నమోదు చేయకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసు శాఖ విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే 2020తో పోల్చితే 2021లో కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణాలు కేసులు నమోదు చేయకుండా అడ్డుకోవడం, బాధితులను బెదిరించి సెటిల్‌మెంట్ చేయడం.. ప్రజా ప్రతినిధుల అపరిమిత జోక్యం.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖ స్వేచ్ఛగా పని చేస్తోంది. స్టేషన్‌కు వెళ్లిన ప్రతి బాధితుని ఫిర్యాదును నమోదు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నాయకుల జోక్యం ఏమాత్రం లేకపోవడంతో పోలీసు శాఖ ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ పని చేసుకుపోతోంది.