- సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ లింక్
- ఓపెన్ చేశారు.. రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు
పోలీసులు ఎంతగా అవగాహన పెంచిన అత్యాశపరుల్లో మార్పు రావడం లేదు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఎరతో సైబర్ నేరస్థులు ఎంతమందిని దోచుకున్నా కొత్తగా మోసపోయేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు. అవగాహన లేని వారే కాదు విద్యావంతులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఇలాగే పటాన్ చెరు పరిధిలో రెండురోజుల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరస్థులు రూ.3.81కోట్లు కొట్టేశారు.
రెండు రోజుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.81 కోట్లు కొల్లగొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచోసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి పటాన్చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో నెలన్నర క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి దాన్ని క్లిక్ చేశాడు. దీంతో అతను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ అయ్యాడు. అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు చెప్పడంతో నమ్మి పెట్టుబడి పెట్టాడు.
దీంతో ఒక పోర్టల్ క్రియేట్ చేసి పెట్టుబడి పెట్టినవారికి వచ్చిన లాభాలంటూ అందులో చూపించారు. ఇలా 22 దఫాలుగా ఏకంగా రూ.2.4కోట్లు పెట్టబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరగాళ్లు మొఖం చాటేశారు. బాధితుడు ఎంత అడిగినా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మరో ఉద్యోగి యూట్యూబ్ చూస్తుండగా స్టాక్ మార్కెట్ ప్రకటన రాగా దాని లింక్‌పై క్లిక్ చేశాడు. ఇతను కూడా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. దాదాపు నెల రోజులుగా రూ.66.75లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరగా ఖతం సీన్ రిపీట్ అయింది. ఇతను కూడా మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.