కేవలం ఒక్క ఓటీపీతోనే కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రూ.4 లక్షల నగదును బాధితుడి ఫోన్కు బ్యాంకు లోగోతో లింక్ పంపి డబ్బును కాజేశారు. దీంతో ఆ తండ్రి సైబర్ పోలీసులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసముద్రం గ్రామంలో జరిగింది. బాధితుడి ఫోన్కు బ్యాంకు లోగోతో కూడిన లింక్ పంపించిన దుండగులు ఎటువంటి ఓటీపీ చెప్పకుండానే రూ.4లక్షల నగదు దోచుకున్నారు. డబ్బులు కట్ అయినట్లు మెసెజ్ రావడంతో బ్యాంకు వెళ్లాడు. దీంతో ఖాతాను ఫ్రీజ్ చేయించి సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసముద్రం గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి నూత్పల్లి గ్రామంలో యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. అతను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన కుమార్తె పెళ్లి కోసం అని చెప్పి అతను బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బును దాచుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఈనెల 10న గుర్తు తెలియని నెంబరు నుంచి వాట్సాప్లో బ్యాంకు లోగోతో మొదట ఒక లింక్ వచ్చింది. ఆతర్వాత అదే రోజు మరొక లింక్ వచ్చింది. కేవలం ఓటీపీతో డబ్బు స్వాహా : మరుసటి రోజు లింకును చూసి క్లిక్ చేయడంతో ఓటీపీతో పాటు 9361158830 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో ముత్యంరెడ్డి ఫోన్ కట్ చేశాడు.
అయితే ఈనెల 12న బ్యాంకు ఖాతా నుంచి మొదటిగా రూ.2 లక్షలు ఒకసారి, రూ.లక్ష ఒకసారి, రూ.50 వేలు, రూ.66,800 నగదు కట్ అయినట్లు బాధితుడి ఫోన్కు మెసెజ్ వచ్చింది. దీంతో రైతు లబోధిబోమంటూ వెంటనే ముత్యంరెడ్డి యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఖాతాను ఫ్రీజ్ చేయించాడు. వెంటనే అక్కడి నుంచి సైబర్ క్రైం నంబరుకు ఫోన్ చేయడంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్కు వచ్చిన గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు.