Saturday, January 11, 2025

‘డాకు మహారాజ్’లో కొత్త బాలకృష్ణని చూస్తారు : బాబీ కొల్లి

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు బాబీ కొల్లి, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘డాకు మహారాజ్’ ఎలా ఉండబోతుంది?
బాలకృష్ణ ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని ‘డాకు మహారాజ్’ సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహానాయుడు’, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.

బాలకృష్ణ గురించి?
బాలకృష్ణ నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు.

ట్రైలర్ లో విజువల్స్ కి మంచి పేరు వచ్చింది కదా. ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నిర్మాత నాగవంశీ బాలకృష్ణని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.

సినిమా ఉపయోగించిన ఆయుధాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టున్నారు?
హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.

మీ గత చిత్రాలతో పోలిస్తే ‘డాకు మహారాజ్’లో కొత్తదనం ఏం ఉండబోతుంది?
నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.

రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ సమయంలో అందరూ బాగా కష్టపడ్డారని తెలిసింది?
దర్శకుడు, నటీనటుల కష్టం కంటే కూడా సిబ్బంది ఎక్కువ కష్టపడ్డారని చెప్పగలను. ఎందుకంటే మేము షూట్ గ్యాప్ లో నీడలో ఉంటాము. కానీ సిబ్బంది విరామమే లేకుండా ఎండలో ఎంతో కష్టపడతారు. అందుకే వారి కష్టం ముందు మా కష్టం చిన్నది అనిపిస్తుంది.

చిరంజీవి, బాలకృష్ణతో కలిసి పని చేయడం ఎలా ఉంది?
సినిమా విషయంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. నిర్మాతలకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. సినిమా కోసం ఎంతయినా కష్టపడతారు. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా రావడానికి, వారికున్న అపార అనుభవంతో పలు సూచనలు ఇస్తూ ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com