సీఎం రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఫైర్
లగచర్ల బాధితులపై సీఎం రేవంత్ రెడ్డికి అంత కోపమెందుకు అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతు హీర్యా నాయక్ కు సంకెళ్ళు వేసి ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజన బాధిత రైతుల పట్ల సీఎం రేవంత్ వైఖరి పాశవికతకు పరాకాశష్ట అని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.. దౌర్జన్యంగా రైతుల నుంచి భూములను లాక్కునే ప్రయత్నం చేసింది చాలక, తప్పుడు కేసులు పెట్టి, ఆఖరికి జైళ్లలో వారికి గుండె సంబంధిత ఇబ్బంది ఉంటే రాజ్యాంగ వ్యతిరేకంగా సంకెళ్లు వేసి హింసించడం న్యాయమా అని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.
వారికి జైళ్లలో కనీస వైద్యం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా ఎన్నిరోజులు వారికీ బెయిల్ రాకుండా అడ్డుకుంటారు? అని ప్రశ్నించారు. మా భూములు మాకే అన్న పాపానికి వారిని చంపుతారా అని మండిపడ్డారు. హీర్యా నాయక్ ను చూసేందుకు అతని కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హీర్యా నాయక్ కు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సూచించారు. గుండె అనారోగ్యతో బాధపడుతోన్న హీర్యా నాయక్ ను సంకెళ్ళు వేసి చికిత్స కోసం అసుపత్రికి తీసుకెళ్ళడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇదేమి పోలీసు రాజ్యం అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.