* పెళ్లి చేయాలనుకున్న తండ్రినే కడతేర్చిన కూతురు
* మదనపల్లిలో అమానుష ఘటన
తండ్రి.. జన్మనిచ్చి.. పెంచి పెద్దచేసి.. ప్రతిక్షణం కంటికిరెప్పలా కాపాడుకునే వాడు. మరి అలాంటి కన్న తండ్రినే మట్టుబెట్టింది ఓ కూతురు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో తండ్రిని కడతేర్చిన కసాయి కుమార్తే. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది ఈ అమానుష ఘటన. మదనపల్లెలోని స్థానిక పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య లత సంవత్సరం క్రితం అనారోగ్యంతో చనిపోయారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తమ ఒక్కగానొక్క కూతురు హరితతో కలిసి సొంతింట్లో నివాసం ఉంటున్నారు దరస్వామి.
కూతురుకు పెళ్లి చేయాలన్న ఆలోచనతో సంపాదించిన డబ్బులన్నీ ఆమె బ్యాంకు అకౌంట్ లో వేయడంతో పాటు.. తల్లి నగలను సైతం అమెకు ఇచ్చాడు. ఇదిలా ఉండగా హరిత మదనపల్లెకు చెందిన రమేశ్‌తో సన్నిహితంగా ఉంటూ తన తల్లి బంగారు నగలను అతనికి ఇచ్చింది. ఇంకేముంది అతను ఆ నగలను తాకట్టు పెట్టి 11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అంతే కాదు సాయికృష్ణ అనే మరో యువకుడికి 8 లక్షలు ఇచ్చింది హరిత. ఈ ఇద్దరే కాకుండా మరో యువకుడు హరీశ్ రెడ్డి తోనూ సన్నిహితంగా ఉంటోందట. మెల్ల మెల్లగా కూతురు చేస్తున్న వ్యవహారాన్ని తండ్రి దొరస్వామికి తెలిశాయి.
దీంతో అమెకు నచ్చజెప్పి పెళ్లి చేయాలని మంచి సంబంధం చూసాడట. ఐతే ముందు సరేనన్న హరిత.. ఆ తరువాత తండ్రి చూసిన సంబందం చేసుకోవడానికి ససేమిరా అంది. గత నెల రోజులుగా ఈ విషయంపై తండ్రి, కూతుళ్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న కోపంతో రగిలిపోయిన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడికక్కడే కుప్పకూళి పోయాడు. అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని హరిత వారికి చెప్పింది. విషయం తెలుసుకుని వచ్చిన పోలీసులకూ ఇలాగే నమ్మించే ప్రయత్నం చేసింది హరిత. ఐతే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి హరితే దొరస్వామిని హత్య చేసినట్లుగా తేల్చారు. మంచి కోరి పెళ్లి చేయాలనుకున్న కన్న తండ్రినే హత్య చేసిన హరితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.