తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్‌తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసి తమ ఓ టును వృధా చేసుకోవాలని ఎవరకూ కోరుకోవడం లేదని చెప్పారు. మునిగే పార్టీకి ఓటు వేయాలని ఏ ఒక్కరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం కచ్చితంగా కొలువుతీరుతుందని నమ్ముతారో ఆ పార్టీకే సామాన్యుడు పట్టం కడతాడని పేర్కన్నారు.
విపక్ష ఇండియా కూటమి పార్టీలు కుల, కుటుంబ పార్టీలని, వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల్లో ఎంతో మంది సమర్దులు ఉన్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేవలం తన కుటుంబ సభ్యులకే పార్టీ టికెట్లు కేటాయిస్తారని ఆరోపించారు. పట్టుబడిన ఉగ్రవాదులను కూడా ఎస్పీ నేతలు విడుదల చేస్తారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. యూపీ, పూర్వాంచల్‌ను వారు మాఫియాకు అడ్డాగా మార్చారని విస్మయం వ్యక్తం చేశారు. ఎస్పీ ప్రభుత్వంలో మాఫియాను కూడా ఓటు బ్యాంక్‌గా పరిగణించారని మోదీ పేర్కొన్నారు.