మహిళల టీ-20 400 మీటర్ల పరుగులో దీప్తి ప్రస్థానమంతా సంచలనమే. గతేడాది పారా ఆసియా క్రీడల్లో రికార్డుతో బంగారు పతకం సాధించింది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతాన్ని సృష్టించి, 55.07 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఆఖరి పోటీలోనూ అదరగొట్టిన దీప్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. ఎనిమిదేళ్లుగా చేసిన కఠోర శ్రమ ఫలితం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మిల తపనతో పాటు ఆర్డీఎఫ్ పాఠశాల పీఈటీ ప్రోత్సాహాంతో నిరంతర శ్రమ చేయడం వల్ల దీప్తిని విజయం వరించింది.
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలతో ఈ ఘనతకు మరింత తోడ్పాటు నందించింది. అంతర్జాతీయ స్థాయి వసతులతో పాటు అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ దీప్తి ఒలింపిక్స్ ప్రయాణాన్ని మరింత సులువు చేసింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో రికార్డు నెలకొల్పి స్వర్ణంతో మెరిసిన దీప్తి పారాలింపిక్స్‌లో తనదైన ముద్ర వేసింది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని సాధారణ నిరుపేద రైతు కుటుంబంలో దీప్తి జన్మించింది.
అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పారా ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తెచ్చిన తమ కూతురిని ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకరించాలని ఈ సందర్భంగా దీప్తి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.
దీప్తి తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. దీప్తి తల్లి వారి ఆర్థిక పరస్థితి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. దేశానికే పేరు తెచ్చిన దీప్తికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండి ఉద్యోగం కల్పించాలని కోరారు. కొంత మంది దాతలు దీప్తిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆర్థిక సహకారం అందించారని తెలిపారు.