- నాగార్జునకు నాంపల్లి కోర్టు ఆదేశం
- మంత్రి కొండా సురేఖపై దావా కేసు విచారణ
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం నాడు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున నేరుగా కోర్టుకు వచ్చి తన వాదనను వినిపించాలని.. స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ అయిన నాగార్జున.. న్యాయస్థానానికి రావాలని ధర్మాసనం ఆదేశించింది. నాగార్జున స్వయంగా న్యాయస్థానానికి వచ్చి తన వాంగ్మూలాన్ని నేరుగా ధర్మాసనానికి వినిపించాలని ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. అక్కినేని కుటుంబం మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆరేనని ఆరోపించిన కొండా సురేఖ.. ఎన్- కన్వెన్షన్ కూల్చివేయకుండా కేటీఆర్ పెట్టిన కండీషన్స్ విషయంలో నాగార్జున, నాగచైతన్య వ్యవహరించిన తీరు నచ్చకపోవటం వల్లే సమంత విడాకులు తీసుకుందని ఆరోపించారు. ఈ క్రమంలోఅక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు కూడా కొండా సురేఖ చేసిన ఆరోపణలను ముక్తకంఠంతో ఖండించారు. దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినా.. కేవలం సమంతను ప్రస్తావిస్తూనే ట్వీట్ చేయటం గమనార్హం.
కొండా సురేఖ చేసిన ఆరోపణలతో తమ కుటుంబ పరువు పోయిందని భావించిన నాగార్జున ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే.. కొండా సురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన, తమ కుటుంబ పరువును భంగపరిచాయని.. ఆమె చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మీడియాతో పాటు నేషనల్ మీడియాలోనూ ప్రసారమయ్యాయంటూ పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. అందుకు సంబంధించిన క్లిప్పింగులను కూడా కోర్టును సమర్పించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ఈ ఆదేశాలిచ్చింది. అయితే, ఓవైపు మంత్రి కొండా సురేఖ, మరోవైపు అక్కినేని నాగార్జున కుటుంబం.. ఇద్దరు కూడా సమాజంలో పేరున్న ప్రముఖులే కావటంతో కేవలం మీడియా ట్రయల్స్‌ని ప్రామాణికంగా తీసుకోమని ధర్మాసనం చెప్పినట్లు తెలుస్తోంది. స్వయంగా పిటిషనర్ నాగార్జునే కోర్టుకు వచ్చి తమ వాదనను వినిపించాలని, తన స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.