హిమాచల్ సర్కారు కీలక నిర్ణయం
పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వారికి పెన్షన్ ను నిలిపివేయనుంది. దీనికి సంబంధించిను సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది.ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ సవరణ బిల్లు 2024ను రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బుధవారం ఓటింగ్ నిర్వహించి ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ‘ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసనసభ్యులు ఇకపై పింఛను పొందే వెసులుబాటు ఉండదు’అని ఈ బిల్లులో పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ చట్టాల ప్రకారం.. ఐదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యేలకు నెలకు రూ.36వేల పెన్షన్ ఇస్తున్నారు. ఐదేళ్లకు మించి పదవీకాలం ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అదనంగా పెన్షన్ అందజేస్తున్నారు.