మా అమ్మను చంపిన నిందితులను పట్టుకోవడంలో జాప్యమెందుకు?
యాక్సిడెంట్ జరిగి నెల దాటినా పురోగతి శున్యం
ఘటన ప్రాంతంలో 16 నిఘా సీసీ కెమెరాలు
సుల్తాన్ బజార్ పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవు
జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర కుమార్తెల ఆవేదన
తండ్రికి పక్షవాతం దిక్కుతోచని స్థితిలో మృతురాలి కుటుంబం
గత నెల (డిసెంబర్) 10వ తేదీన హైదరాబాద్ కోఠి చౌరస్తాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిరా(36) అనే అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఇందిరాకు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందిర కుటుంబ సభ్యులతో చాదర్ ఘాట్ మూసనగర్ లో నివాసం ఉంటూ జీహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తు కుటుంబాన్ని పోషించేది. భర్త పక్షవాతంతో మంచాన పడగా కుటుంబ భారమంతా మోసే ఇందిరా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిపోయింది.
రెక్కాడితే డొక్కాడని కుటుంబం.. ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. కోఠిలో తల్లికి యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని పోలీసులు నెల రోజులుగా గుర్తించకపోవడంపై ఆమె కుమార్తెలు అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత ప్రమాదం జరిగితే గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ 16 సీసీ కెమెరాల నిఘా ఉందని, అవి పనిచేయడం లేదని సుల్తాన్ బజార్ పోలీసులు చెబుతుండడం నమ్మశక్యం లేదన్నారు. ఘటన జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు వాహనాన్ని గుర్తించకపోవడంపై ఇందిరా కుమార్తెలు అనుమానం వ్యక్తం చేశారు.