Wednesday, October 16, 2024

డిగ్రీలో కామర్స్ కోర్సుకే క్రేజ్

  • అత్యధికంగా బి.కాంలోనే ప్రవేశాలు
  • సంప్రదాయ కోర్సులకే విద్యార్థుల మొగ్గు
  • డిగ్రీ ప్రవేశాలలో సగానికి పైగా అమ్మాయిలే

బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(బి.కాం) డిగ్రీకే క్రేజ్ ఉంటుంది. డిగ్రీలో చేరే విద్యార్థుల్లో ఎక్కువగా బి.కాం కోర్సులో చేరుతున్నారు. బ్యాంకింగ్ రంగం, ఛార్టర్డ్ అకౌంటెంట్‌తో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలు, కంపెనీలలో కామర్స్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరగడంతో బి.కాంలో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దోస్త్ ద్వారా సీట్లు కేటాయించిన వారిలో అత్యధికంగా 77,469 సీట్లు కేవలం బి.కాం కోర్సుల్లోనే ప్రవేశాలు పొందారు. మొత్తం ప్రవేశాలలో అత్యధిక ప్రవేశాలు బి.కాం సీట్లే భర్తీ అయ్యాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యూనివర్సిటీలు బిబిఎ, బిబిఎం, బిసిఎ, బిఎస్‌డబ్లూ వంటి డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నా విద్యార్థులు మాత్రం సంప్రదాయ కోర్సులకే మొగ్గు చూపుతున్నారు. డిగ్రీలో బి.కాం తర్వాత బిఎస్‌సీ పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. దోస్త్ ద్వారా బిఎస్‌సి లైఫ్ సైన్సెస్‌లో మొత్తం 36,733 మంది విద్యార్థులు సీట్లు పొందగా, బిఎస్‌సి ఫిజికల్ సైన్స్‌లో 32,181 మంది అడ్మిషన్లు పొందారు. రాష్ట్రంలో 1,055 డిగ్రీ కాలేజీల్లో మొత్తం 4,57,704 సీట్లు అందుబాటులో 1,96,442 భర్తీ అయ్యాయి. 160 ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో 89,337 సీట్లు అందుబాటులో ఉండగా, 55,361 సీట్లు భర్తీ కాగా, 816 ప్రైవేట్ కాలేజీల్లో 3,44,793 సీట్లకు 1,32,388 సీట్లు, 79 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 23,574 సీట్లకు 8,693 సీట్లు భర్తీ అయ్యాయి.

బి.ఎకు తగ్గని క్రేజ్

బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్(బి.ఎ) డిగ్రీకి కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. బి.ఎ చదవడం వల్ల పెద్దగా ఉద్యోగ, ఉపాధి లభించడం లేదని భావించిన విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా ఆ డిగ్రీ జోలికి వెళ్లలేదు. డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా ఎక్కువగా బిఎస్‌సి, బి.కాం కోర్సులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే సివిల్ సర్వీసెస్, గ్రూప్ -1, గ్రూప్- 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వంటి పోటీ పరీక్షలలో ఆర్ట్ సబ్జెక్ట్‌లు చదివిన అభ్యర్థులే ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. మిగతా సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు పోటీ పరీక్షలు రాసినా చరిత్ర, పౌర శాస్త్రం, అర్థ శాస్త్రం వంటి సబ్జెక్టులలో నైపుణ్యాన్ని సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాంతో పోటీ పరీక్షలకు సిద్దం కావాలనుకున్న విద్యార్థులు ఎక్కువగా బి.ఎ డిగ్రీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో బి.ఎ కోర్సులో 28,362 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అలాగే బిబిఎలో 15,835 మంది ప్రవేశాలు పొందారు.

కొత్త డిగ్రీలపై ఆసక్తి కనబరచని విద్యార్థులు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యూనివర్సిటీలు బిబిఎ, బిబిఎం, బిసిఎ, బిఎస్‌డబ్లూ వంటి కొత్త డిగ్రీలు అందుబాటులోకి తీసుకువచ్చినా, ఈ కోర్సుల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ కోర్సులు కొత్తలో విద్యార్థులను ఆకర్షించగలిగినా దీర్ఘకాలికంగా మాత్రం సంప్రదాయ కోర్సులకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో బిబిఎం 100 సీట్లు, బిఎస్‌డబ్లూలో 25 సీట్లు మాత్రమే భర్తీ కాగా, బిసిఎలో 5,170 సీట్లు భర్తీ అయ్యాయి.

డిగ్రీ ప్రవేశాలలో సగానికిపైగా అమ్మాయిలే

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే అమ్మాయిల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,96,442 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రవేశాలలో 1,05,329 మంది అమ్మాయిలే చేరగా, 91,113 అబ్బాయిలు చేరారు. మొత్తం డిగ్రీ సీట్లలో అమ్మాయిలే అత్యధిక ప్రవేశాలు పొందారు. డిగ్రీతో కూడా వృత్తి విద్యా కోర్సులతో సమానంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొన్ని కాలేజీలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఇప్పిస్తున్నాయి. దాంతో ఏటా డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular