- ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం
- కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం
- తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు కృష్ణా నది వెంబడి ఉంటుందని, నది సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరలో ఉన్న రోడ్డు కావడంతో తుపాన్లు, వరదల సమయంలో బ్యాక్ వాటర్స్ రోడ్డును బలంగా తాకుతుంటాయని తెలిపారు. ఫలితంగా రోడ్డు దెబ్బ తింటోందని, ఇటీవలి భారీ వరదలకు 700 మీటర్ల మేర కోతకు గురైందన్నారు.
8 వేల ఎకరాలు కాపాడవచ్చు
ఈ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు చేసి, రూ.4 కోట్లతో అంచనాతో మంజూరై పనులు ప్రారంభ దశలో ఉన్నాయని… అయితే భారీ వరదల మూలంగా ధ్వంసం కావడంతో రోడ్డు మొత్తం తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కోతకు గురైన ప్రాంతంలో 700 మీటర్ల మేర తిరిగి ఆ పరిస్థితి రాకుండా తీరం వెంబడి ఆర్.సి.సి. పర్కుపైన్స్ వేస్తామని ఆ తరవాత రోడ్డు నిర్మిస్తామని వివరించారు. ఈ విధంగా రోడ్డు నిర్మిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో కోతకు గురై, గండి పడకుండా చేయవచ్చని… తద్వారా 8 వేల ఎకరాలను, 12 వేల జనాభాను కాపాడవచ్చని తెలిపారు.
ఈ రోడ్డు పునర్నిర్మాణాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. సవరించిన అంచనాలతో కూడిన నివేదికను సత్వరమే పంపించాలని, వ్యయాన్ని ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ నుంచి తీసుకోవాలని ఈ.ఎన్.సి.కి దిశానిర్దేశం చేశారు.
ఫంట్ల పరిస్థితిపై నివేదిక పంపండి
ఏటిమోగ నుంచి ఎదురుమొండి, అక్కడి దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన ఫంట్లు అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సాయం పొందే విషయమై జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకోవాలని తన కార్యాలయ అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఫంట్లు సామర్థ్యం, తీసుకొంటున్న భద్రత చర్యలు, వాటి అమలుపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఏటిమోగ నుంచి ఎదురుమొండి వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవశ్యకతను రోడ్లు మరియు భవనాల శాఖకు తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు.