• గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 28.5 లక్షల అంచనా వ్యయంతో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న గొల్లప్రోలు తహసీల్దార్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు.
రూ.16 లక్షల అంచనా వ్యయంతో యు.పి.హెచ్.సి. ప్రహరీ నిర్మాణంతోపాటు ఎలక్ట్రికల్, పారిశుధ్య పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో సుద్దగడ్డ డ్రెయిన్ పై 9.2 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం గొల్లప్రోలు శివారులో లోతట్టు ప్రాంతంలో పేదల ఇళ్ల పథకంలో భాగంగా 2,200 మంది నిరుపేదలకు ఇళ్లు కేటాయించింది. కొద్దిపాటి వర్షానికే సుద్దగడ్డ కొండ కాలువ పొంగి కాలనీ రహదారులు నీట మునుగుతున్నాయి.
బ్రిడ్జి నిర్మాణంతో ఆ 2,200 కుటుంబాలకు ముంపు కష్టాలు తీరనున్నాయి. దీంతోపాటు సీఎస్ఆర్ నిధులు రూ.3.2 లక్షల అంచనా వ్యయంతో మొగలి సూరీడు చెరువు సుందరీకరణ, రూ. 24 లక్షల అంచనా వ్యయంతో సూరంపేట ఉత్తర, దక్షిణం వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం, రూ.19 లక్షల అంచనా వ్యయంతో గొల్లప్రోలు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల ఆధునీకరణ, రూ. 62 లక్షల అంచనా వ్యయంతో మండల ప్రజాపరిషత్ పాఠశాల నంబర్ . 2 గొల్లప్రోలు తరగతి గదుల నిర్మాణం, కాంపోనెంట్స్, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాలు, మూడు చక్రాల సైకిల్స్ తో పాటు దివ్యాంగులకు ఉపయుక్తమైన పరికరాలు పంపిణీ చేశారు. మొత్తం 143 మంది దివ్యాంగులకు వినికిడి సామాగ్రి, ట్రై సైకిల్స్ తదితర 240 ఉపకరణాలు అందజేశారు.