Thursday, December 26, 2024

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట

• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు
• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి
• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు
• వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు
• ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు
• పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి
• ఇది మొండి ప్రభుత్వం కాదు… వినే ప్రభుత్వం…
• పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం
• పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఇష్టానుసారం నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలన, సుపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్ధిక విచ్చలవిడితనంతో పంచాయతీల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. సర్పంచులకు విలువ లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దీనిని సరిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం. ఆయన అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నది మొండి ప్రభుత్వం కాదు… ఇది వినే ప్రభుత్వం… బలంగా ఉండాల్సిన చోట బలంగా ఉంటుంది… మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉంటుందని తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నాయకులతో సమావేశం అయ్యారు. సంఘం సభ్యులు పంచాయతీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అధికారంలోకి రాక ముందు నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా ఆలోచనలు చేశాము. ఎన్నో సదస్సులు నిర్వహించాము. దేశంలో 70 శాతం ప్రజానీకం పల్లెల్లోనే ఉంటారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి ఆకాంక్షల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే ముందుకు తీసుకువెళ్తున్నాము. సర్పంచుల నుంచి వచ్చిన డిమాండ్లలో మొదట కీలకమైన వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము. ఒకటికి పదిసార్లు చెప్పించుకునే పరిస్థితి లేకుండా చూస్తున్నాము. దేశంలోనే కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైనది. అక్కడ పని చేసిన ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణ తేజ అనుభవాన్ని వాడుకునేందుకు వీలుగా ఆయన్ని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకువచ్చాము. శాఖలో అధికారులు అంతా పంచాయతీరాజ్ వ్యవస్థను బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆకాంక్ష కలిగిన వారే.

పల్లె వనం ద్వారా పంచాయతీల ఆదాయం పెంపు
గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచేందుకు ఇప్పటికే పల్లెవనం కార్యక్రమానికి రూపకల్పన చేశాము. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పోషించేందుకు పల్లెవనం ప్రారంభించాము. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల ఆదాయం పెంచడంతో పాటు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మన దేశం ఏటా 20 వేల కోట్ల మెట్రిక్ టన్నుల పైచిలుకు కలప దిగుమతి చేసుకుంటోంది. మన దేశ అవసరాలకు సరిపడా కలప మనమే పెంచుకోగలిగే విధానాన్ని రూపొందిస్తున్నాము. వెదురు పెంపకంతో పాటు బయో డీజిల్ తీసే మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రతి పంచాయతీ కలప పెంచే లక్ష్యాలను నిర్ధేశిస్తాము. దీంతో పంచాయతీల ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుంది.

పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్ చేసే పద్దతిని తీసివేశాం
గత ప్రభుత్వం 12, 900 పంచాయతీలకు సంబంధించిన రూ. 8,629 కోట్ల నిధులను వివిధ మార్గాల్లో మళ్లించింది. వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సర్పంచులు అడిగారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకువెళ్తాము. 15వ ఆర్ధిక సంఘ నిధులు రూ. 750 కోట్లు త్వరలోనే పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయి. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే నిధులను వేరు వేరు మార్గాలకు మళ్లించడం లేదు. ఏ పంచాయతీ నిధులు అక్కడే వినియోగం అయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాము. ఇప్పటికే పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్ చేసే పద్దతిని తీసివేశాము. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించేసుకున్నారు. పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదు అని సర్పంచులు చెబుతున్నారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలకు జవాబుదారీతనం లేదు. పాలసీలు అమలు చేయకుండా నిధులు ఇష్టారాజ్యంగా వాడేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్ లో చర్చిస్తాము.

వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసింది
గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలు ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంచే అంశం పరిశీలనలో ఉంది.

గ్రామ సభలు ఇంకా ప్రభావవంతంగా నిర్వహించాలి. తూతూ మంత్రంగా కాకుండా గ్రామ ప్రజలందరు అందులో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సర్పంచుల సహకారం కూడా ఉంటే పల్లెల్లో అభివృద్ధిని మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకువెళ్తాము. రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఎన్నికైన సర్పంచులకు గౌరవ స్థానం ఇవ్వడంతోపాటు ప్రథమ పౌరులుగా గుర్తించే అంశాన్ని పార్టీలకు అతీతతంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. స్వయం పాలిత పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాము.

గ్రామీణ మంచి నీటి వనరుల సంరక్షణకు చర్యలు
జల్ జీవన్ మిషన్ ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు అందించాలన్నది ఆయన సంకల్పం. ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుతున్న సమయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడాలి అనే అంశం చర్చకు వచ్చింది. తాగునీటి పైపు లైన్ల డిజైన్ లో తప్పులు ఉన్నాయి. సాంకేతికత సహాయంతో తప్పులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. రాజంపేటలో పర్యటనలో మా దృష్టికి వచ్చిన తాగునీటి సమస్యను 8 రోజుల్లో పరిష్కరించాము. మనసుతో పని చేస్తే సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయి. 24 గంటలు నిరంతరాయంగా తాగు నీరు ఇవ్వాలన్న ప్రధాన మంత్రి గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మొదట గ్రామాల్లో ఉన్న చెరువుల పూడికలు తీయడం, గ్రామీణ మంచినీటి వనరులు రక్షించుకునే అంశం మీద దృష్టి సారించాలి. గ్రామ స్థాయిలో సర్పంచులు కలసి వస్తే తాగు నీటి వనరుల సంరక్షణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాము.

ఇసుక, మైనింగ్ సీనరేజ్ లో పంచాయతీలకు రావాల్సిన వాటాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. క్వారీల్లో పేలుళ్ల వల్ల జరిగే నష్టానికి పరిహారం ఇవ్వాలి. మైనింగ్ సీనరేజ్ లో పంచాయతీల వాటా పంచాయతీలకు ఇప్పించేలా కృషి చేస్తాం. గత ప్రభుత్వం ఎంత బకాయిలు ఉందో వివరాలు తీసుకోవాల్సి ఉంది. ఆర్ధికపరమైన డిమాండ్లు ఆర్ధిక శాఖ కార్యదర్శితో చర్చిస్తాము.

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు చెక్ పెడతాం
గత ప్రభుత్వ హయాంలో నరేగా పనుల్లో భారీగా అవకతవకలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. నిధుల్లో 60 శాతం మెటీరియల్ కాంపొనెంట్ కు, 40 శాతం కూలీల వేతనాల కింద ఇస్తున్నారు. అయితే పనికి రాకుండా మస్తర్లు పెట్టేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. సోషల్ ఆడిట్ బలంగా తీసుకు వెళ్లేందుకు ఉన్నత స్థాయి పోలీసు అధికారిని నియమించాము. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండేలా ఫీల్డు విజిట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన ఉండేలా చర్యలు తీసుకుంటాము. పంచాయతీల పరిధిలో ఎంత పనులు జరుగుతున్నాయి? వస్తున్న నిధులు ఎంత అనే అంశానికి సంబంధించి సమాచారంతో ఇప్పటికే సిటిజన్ చార్టు బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాము.

ప్రతి పంచాయతీకి ఆయా పంచాయతీల్లో పని చేస్తున్న అధికారులు సిబ్బందితో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారలోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాము. పల్లె పండుగ పనులు జనవరి నాటికి పూర్తి కావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము. పూర్తి స్థాయి పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలిస్తున్నాము. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మీ స్థాయిలో కూడా పనుల్లో నాణ్యతా లోపం లేకుండా పర్యవేక్షణ ఉంచండి. ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుంది. పంచాయతీల్లో సమస్యలపై చర్చించేందుకు నెలకి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుందాం” అన్నారు. శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు, మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షులు శ్రీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు, సర్పంచుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com