Tuesday, December 24, 2024

దాడిని కెసిఆర్ సమర్థిస్తున్నారా..?

  • ఇది ప్రతిపక్షం చేయాల్సిన పనేనా..!
  • ప్రభుత్వాన్ని మీరు అస్థిరపర్చలేరు
  • లగచర్ల ఘటనపై మీ వైఖరేంటి..?
  • కాల్‌డేటా ఆధారంగా కుట్రదారులపై చర్యలు
  • పరిశ్రమలు రావాలంటే భూసేకరణ తప్పదు
  • కెసిఆర్‌పై డిప్యూటీ సిఎం భట్టి తీవ్ర ఆగ్రహం

వికారాబాద్ జిల్లా లగచర్లలో కుట్రపూరితంగా కలెక్టర్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మీరు భూసేకరణ చేస్తే ఎప్పుడైనా ఇలా వ్యవహరిచామా..?, అధికారులపై దాడులు చేయడం కరెక్టేనా..? అంటూ కెసిఆర్‌ను ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పనేనా ఇది అని కెసిఆర్‌పై భట్టి తీవ్రంగా వ్యాఖ్యానించారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. భూసేకరణ జరిగే సమయంలో ఎక్కడైనా సరే రైతుల నుంచి చిన్న చిన్న సమస్యలు సహజంగా వస్తాయని, వాటిని ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకోవాలి, లేదంటే కోర్టులో పరిష్కారం చేసుకోవచ్చునని అన్నారు. అలాకాకుండా ఇలా కలెక్టర్, ఇతర అధికారులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని కెసిఆర్‌ను నిలదీశారు. కలెక్టర్‌పై దాడిని మీరు సమర్థిస్తున్నారా..?

అసలు ఈ ఘటనపై మీ వైఖరి ఏమిటని కెసిఆర్‌ను ఆయన ప్రశ్నించారు. అధికారులపై దాడి చేయిస్తే తాము వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? అని అన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీశ్ రావులు తమ ప్రభుత్వాన్ని ఎంత అస్థిరపర్చాలని చూసినా సాధ్యం కాదని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. లగచర్ల దాడికి ఘటనకు కారకులు ఎంతటి వారైనా వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనపై నిందితుల కాల్ డేటాను పోలీసులు విచారిస్తున్నారని, ఈ కాల్ డేటా ఆధారంగా వెనుక ఉండి చేయించిన పెద్దలెవరో బయటకు వస్తుందని అన్నారు. అమాయక గిరిజన రైతులను రెచ్చగొట్టి బిఆర్‌ఎస్ దాడికి ఉసిగొల్పిందని దుయ్యబట్టారు. ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని, తాము ప్రతిపక్షంలో ఉండగా ఇలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్‌ఎస్ కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. దాడులు సమస్యలకు పరిష్కారం కాదని ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛం ఉందన్నారు. పరిశ్రమలను పెద్దఎత్తున తీసుకోచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో కూడా అభివృద్ధిని విస్తరిస్తామని పేర్కొన్నారు. వెనుకబడిన కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, దీనిలో భాగంగానే కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకువస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంతో పోటీ పడగలమని అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాలని అన్నారు. భూమి కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసని, ఆ రైతుల బాధను ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని తెలిపారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కలిపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భూసేకరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని తెలిపారు.

గవర్నర్ అనుమతి ఆపేందుకే కెటిఆర్ ఢిల్లీ వెళ్లారు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఢిల్లీ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ వెళ్లింది ఈ ఫార్ములా కార్ రేసింగ్ స్కాంలో తనను అరెస్టు చేయకుండా గవర్నర్ అనుమతి ఆపేందుకే వెళ్లారని అన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన గవర్నర్ నుంచి అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కేసులో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యగా అభివర్ణించారు. తమకు గవర్నర్ పట్ల నమ్మకం ఉందని ఫార్ములా ఈ రేస్ విచారణకు అనుమతి వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్తామన్నారు. మహారాష్ట్ర రైతులను ఉద్దరిస్తాన్న మీరు అక్కడ ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. నిన్నటి వరకు బీజేపీతో పోరాటం చేశానని చెప్పుకున్న మీరు ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి ఓటు వేయాలని దేనికోసం పిలుపు ఇస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ ఒప్పందం కుదిరిన వెంటనే కెటిఆర్ బయటకు వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటూ చెబుతున్నారన్నారు.

లగచర్ల నిర్వాసితులకు భారీ పరిహారం
ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న లగచర్ల వాసులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు నిర్వాసితులకు భారీ ఎత్తున పరిహారం ఇస్తామని ప్రకటించారు. విపక్షాల వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొదని రైతులకు పిలుపునిచ్చారు. కొడంగల్ ప్రాంతం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు. పరిశ్రమలు వస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి ఊపందుకుంటుందని, అందుకు భూసేకరణ తప్పనిసరి అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నిర్వాసితులందరికీ భారీ ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని హమీ ఇచ్చారు. అదేవిధంగా ఇళ్లను సైతం కోల్పోతున్న వారికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇస్తామని భట్టి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com