భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అపరకుబేరుల స్పందన
పాక్‌తో యుద్ధం కారణంగా భారత్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటన
దేశానికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధమంటూ వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటన
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అపరకుబేరులు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్‌తో యుద్ధం కారణంగా భారత్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది: అదానీ
“ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది. మన మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము. ఇండియా ఫస్ట్. జై హింద్!” అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధం: అంబానీ
“దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళల సిద్ధంగా ఉంటాం. ఆపరేషన్ సిందూర్ కోసం మన భారత సాయుధ దళాలను చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో భారత సాయుధ దళాలు సరిహద్దు అవతల నుంచి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వంతో ప్రతిస్పందించాయి. ఉగ్రవాదం నేపథ్యంలో భారతదేశం ఎప్పుడూ మౌనంగా ఉండదని, మన గడ్డపై, మన పౌరులపై ఒక్క దాడిని కూడా మనం సహించబోమని మోదీ నాయకత్వం నిరూపించింది.
గత కొన్ని రోజులుగా మన శాంతికి ఎదురయ్యే ప్రతి ముప్పును దృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని చూపించాయి. రిలయన్స్ కుటుంబం మన దేశం యొక్క ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుంది. కానీ దాని గర్వం, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టదు. కలిసి, మనం నిలబడతాం. మనం పోరాడుతాం. మనం గెలుస్తాం. జై హింద్! జై హింద్ కీ సేనా!” అని ముఖేశ్ అంబానీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.