కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2025-26కు సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తి ప్రస్తావించారు.
‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే తమ స్ఫూర్తి, మార్గదర్శి అని తెలిపారు.
గంటా 15 నిమిషాల ప్రసంగం
గంటా 15 నిమిషాల పాటు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం.. మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగింది.
ఇక తన బడ్జెట్ ప్రసంగాన్ని గురజాడ అప్పారావు సూక్తితో నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. చివరగా మధ్య తరగతి జీవులకు ఊరటనిచ్చే పన్నులకు సంబంధించిన అంశాన్ని సవివరంగా చెప్పి.. తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. బీఎన్ఎస్ స్ఫూర్తితో వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇక త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రానికి నిర్మలమ్మ వరాలు కురిపించారు. పాట్నా అభివృద్ధి, బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్, కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఇక లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
కాగా, 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను (వరుసగా 6 సార్లు) అధిగమించారు. ఇవాళ ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో ఆమె మరో మైలురాయిని అందుకున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేశారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పీ. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.