Friday, December 13, 2024

దేశంలో ‘సెకను’కు 11 సైబర్‌ మోసాలు

డీఎస్‌సీఐ నివేదికలో సంచలన విషయాలు

ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసినా సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ మోసాలే. కోట్లకు కోట్లు దోచేస్తున్నారు. కీలక డేటాలను తస్కరిస్తున్నారు. పరిజ్ఞానం పెరిగే కొద్దీ ప్రమాదాలూ పొంచి ఉంటున్నాయనేది మర్చిపోకూడదు. ఎంత కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించినా అవేవీ సైబర్‌ గజదొంగలకు అడ్డేకాదు. దాని ఆసరాగా చేసుకుని కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నారు. సో మనం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిక. పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ మోసాల పట్ల అవగాహనతో ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే.. డేటా అయినా డబ్బు అయినా తస్కరణ తప్పదని వార్న్‌ చేస్తున్నారు. అంతే కాకుండా సైబర్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టే టెక్నాలజీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానంతో కూడిన మాల్‌వేర్‌లతో సైబర్‌ దాడులు ఎక్కువగా జరిగే అవకాశముందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్‌ అనే సంస్థ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. సగటున 702 సైబర్‌ దాడులు జరిగినట్లు తేల్చారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు గుర్తించారు. సంక్షేమ పథకాలు, హెల్త్‌, హాస్పిటాలిటీ, ఫైనాన్స్‌, వంటి రంగాలపై ఈ సైబర్‌ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఇటీవల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఓ వైద్యుడి నుంచి సైబర్‌ నేరగాళ్లు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరిట ఆగస్టు నుంచి నవంబరు వరకు 34 విడతలుగా 11.11 కోట్ల రూపాయలు కాజేశారు. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్‌వేర్ల ద్వారా దాడులు జరిపి.. వ్యక్తిగత జీవితాల్లోకీ చొరబడతారని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని.. బయోమెట్రిక్‌ డేటా దోపిడీ మరింతగా పెరగనుంది. ఫేక్‌ యాప్‌లు, ఫేక్‌ అప్లికేషన్స్‌ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముంది. పెట్టుబడిదారులను మోసం చేసి భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు మరింత పెరుగుతాయంది. అయితే సైబర్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టే సాంకేతికతను మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నివేదిక సూచించింది.
రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత మాల్‌వేర్లు, డీప్‌ ఫేక్‌ ఎక్స్‌ప్లాయిట్స్, డేటా చౌర్యం, ర్యాన్సమ్‌వేర్‌ లాంటి నేరాలకు ఆస్కారముంది. 5జీ నెట్‌వర్క్‌తో సైబర్‌ నేరాలూ పెరుగుతాయి. డిజిటల్‌ భద్రత కోసం బలమైన సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. సంస్థలు తమ ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇప్పించాలి. డేటా సెక్యూరిటీ, మాల్‌వేర్‌ ప్రొటెక్షన్, సెక్యూర్‌ కాన్ఫిగరేషన్, డేటా బ్యాకప్‌ అండ్‌ రికవరీ, ప్రైవసీ కంట్రోల్‌.. లాంటి సైబర్‌ హైజీన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా హ్యాకర్ల దాడులను తిప్పికొట్టేందుకు ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular