-
కర్ణాటకలో భూ సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న
-
విధి, విధానాలపై ధరణి కమిటీ స్టడీ
-
కర్ణాటక రెవెన్యూ మంత్రి, అధికారులతో పలు అంశాలపై చర్చ
కర్ణాటకలో భూ సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధి, విధానాలపై ధరణి కమిటీ స్టడీ చేస్తోంది. బెంగుళూరులోని ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్, ఎం.కోదండరెడ్డిలు కలిశారు. ప్రధానంగా కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడతో భూమి సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమాల గురించి వారు చర్చించారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న భూమి, కావేరీ ప్రాజెక్టులు, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూముల సర్వే తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కర్ణాటక చిన్న నీటి పారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజుతోనూ అక్కడి విధానాల గురించి చర్చించారు. ఆర్‌ఓఆర్ 2024 డ్రాఫ్ట్ లో చేపట్టాల్సిన మార్పులు, చేర్చాల్సిన అంశాలపై స్టడీ చేశారు.
అక్కడ విజయవంతంగా అమలవుతున్న అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా 2008 నుంచి ప్రతి లావాదేవీకి తప్పనిసరి చేసిన మ్యాప్ విధానంపై తలెత్తిన సమస్యలు, పరిష్కార మార్గాలపై మాట్లాడారు. జియో రెఫరెన్స్ పద్ధతులు సక్సెస్ గా అమలవుతున్నట్టు ధరణి సభ్యులు గుర్తించారు. ఇప్పటికే భూదార్ నంబర్‌ను అక్కడ జనరేట్ చేస్తున్న విషయాన్ని సైతం ధరణి సభ్యులు గుర్తించారు. కొత్త ఆర్‌ఓఆర్ చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచి అమలు చేసినా దేశంలో రెండో రాష్ట్రంగానే మిగలనుంది. ఇంకా పలు అంశాలపై కర్ణాటక మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించినట్లు ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్ తెలిపారు.