ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం -2024ను తీసుకువస్తున్నాం
ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం
గత సిఎం వ్యక్తిగత కారణాల వల్ల విఆర్‌ఓ, విఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి పంపించారు
ఎవరి పైరవీలు లేకుండానే ఉద్యోగుల పని తీరు ఆధారంగా ప్రమోషన్లు, పోస్టులు
త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతా
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
‘ధరణి’ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడు కుంటామని, రైతులకు ఏ భూమి చిక్కులు కూడా లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం – 2024ను తీసుకువస్తున్నామని ఆయన ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టి హరితప్లాజా హోట్‌ల్‌లో సోమవారం ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సామాన్యుడి నుంచి మేధావి వరకు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడంతో పాటు ఇటువంటి చర్చావేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేస్తాం
రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని అలాగే రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని, అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యవహారిస్తామని ఆయన అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదించుకోవాలనుకుంటే గత అసెంబ్లీలోనే జరిగేదని, కానీ, లొసుగులు లేని చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
త్వరలో ప్రమోషన్ల క్యాలండర్ విడుదల
రెవెన్యూ వ్యవస్థలోని సమస్యలు, పదోన్నతుల అంశాలు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిని కలవాలంటేనే కనీసం వారం రోజులు పట్టేదని, కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు. తాము కలిసి పని చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఆలస్యం జరిగినా పక్కాగా ఉండేలా తీసుకుంటామన్నారు. గత సిఎం వ్యక్తిగత కారణాల వల్ల విఆర్‌ఓ, విఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి పంపించారని, కానీ, గ్రామానికి రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారి ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన లేకపోవడం బాధాకరమన్నారు.
పదోన్నతుల విషయంలో క్యాలండర్ విడుదల చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఎవరి పైరవీలు అక్కర్లేకుండానే ఉద్యోగుల పని తీరు ఆధారంగా ప్రమోషన్లు, పోస్టులు ఇస్తామన్నారు. త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. ఈ చట్టం తయారు చేసే విషయంలో మరిన్ని సూచనలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమే ఈ కొత్త చట్టం తీసుకురావడం లేదని, కేవలం రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతిఒక్కరికి భరోసా కల్పించడం కోసమే ఈ కొత్త చట్టం తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు.
రెవెన్యూ శాఖను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమే….ట్రెసా
విఆర్‌ఓలుగా పని చేసిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ వ్యవస్థపై గతంలో ఎన్నోసార్లు కుట్ర జరిగిందని కానీ, ఈ శాఖను కాపాడింది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని ట్రెసా ప్రతినిధులు చెప్పారు. గత ప్రభుత్వం తమను దొంగల్లా చిత్రీకరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రెవెన్యూ చట్టాన్ని గ్రామీణ స్థాయిలో రైతులకు మేలు చేకూర్చేలా పకడ్భందీగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ట్రెసా ప్రతినిధులు మంత్రితో పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌లు వెంకట ఉపేందర్ రెడ్డి, కె.చంద్రకళ, హమీద్, సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌లు చంద్రావతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.