చిల్డ్రన్ హోంలో ఉంటున్న పిల్లలకు చెల్లిస్తున్న కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. సబ్బులు, నూనె, ఇతర అవసరాలకు వారికి ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.75 చెల్లిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి రూ.150 చెల్లించనుంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్‌థల సొసైటీ పరిధిలోని హాస్టళ్లలో విద్యార్థులకు డైట్‌చార్జీలను, బాలికలకు కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. చార్జీల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రిపోర్టును అందించగా, ఆయన సీఎంకు అందజేశారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్న కమిటీ సిఫార్జులను సీఎం ఆమోదించారు. ఇప్పటివరకు 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీ రూ.950చొప్పన ఉండగా, దానిని రూ.1,330కి ప్రభుత్వం పెంచింది. 8 నుంచి టెన్త్ వరకు రూ.1,100గా ఉన్న డైట్ చార్జీని రూ.1,540కి పెంచింది. అలాగే ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500గా ఉన్న డైట్ చార్జీ రూ.2,100కి పెరిగింది.
3 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థినులకు కాస్మోటిక్ చార్జీ 55 చొప్పున ఉండగా, దానిని రూ.175కు ప్రభుత్వం పెంచింది. 8 నుంచి టెన్త్ వరకు 11 సంవత్సరాలపైన ఉన్న విద్యార్థినులకు ఇప్పటివరకు రూన.75గా ఉన్న కాస్మోటిక్ చార్జీని రూ. 275కు పెంచింది. అలాగే 3 నుంచి 7వరకు చదువుతున్న బాలురకు కాస్మోటిక్ చార్జీ రూ.62 చొప్పన ఉండగా, రూ. 150కి పెరిగింది. ఈ విధంగా రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్‌లో కలిపి 7,65,705 మంది స్టూడెంట్లు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.