Sunday, November 17, 2024

కొత్త రాగంపై భిన్న స్వరాలు

కొన్ని వివాదాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. లేకపోతే రాముడిపై రాసిన 16వ శతాబ్దం నాటి రామచరిత మానస్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారటమేంటి? ప్రస్తుతం కొన్ని వారాలుగా రామచరిత మానస్‌ మీద మేధావి వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. మహిళలు, దళితుల పట్ల దీనిలో వివక్ష కనిపిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇలా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. నిరసనల్లో భాగంగా రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను తగులబెడుతున్న వీడియోలు, ఫొటోలు పోయిన నెలలో కనిపించాయి. ఈ గ్రంథాన్ని విమర్శిస్తున్న వారిని, కించపరుస్తున్న వారిని అరెస్టు చేయాలని నిరసనలు మొదలయ్యాయి. అది పక్కన పెడితే వారం నుంచి ఇళయరాజాపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల వర్షం కురుస్తోంది. కొందరు ఆయన ఫొటో పెట్టి ఏకంగా తిట్టిపోశారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి?

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ నిర్మాణ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా ఓ పాటను ఆ సినిమాలో ఉపయోగించారని పేర్కొన్నారు. ఇది కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు. య‌థార్థ క‌థ‌ ఆధారంగా రూపొందిన ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’చిత్రంలో గతంలో ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘గుణ’లోని పాటను వాడారు. ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఈ హిట్ సాంగ్‌ను వాడుకున్నారని ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరఫు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు.

సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇక పాటలను అనుమతిలేకుండా స్టేజ్‌ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. ఆయన పాట ఆయన ఇష్టం. ఆయనే నోటిసు పంపుకున్నారు. మధ్యలో జనాలకేం పని.. ఆయన ఆల్రెడీ ఆ పాట నిమిత్తం నిర్మాత దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా. అయినా ఈ కక్కుర్తి ఎందుకు అని తిట్టిపోయటం మొదలెట్టారు. కాపీ రైట్స్ యాక్ట్ గురించి మరికొందరు యాకవరు పెడుతున్నారు. ఆయన గెలవడు ఓడిపోతాడని అంటున్నారు. ఎందుకు అంత గొప్ప సంగీత జ్ఞానిపై అంత విద్వేషం అర్థం కాదు.

మరో విషయం రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ నిర్మాణ సంస్థకు కూడా ఇళయరాజా ఇటీవల లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమా టైటిల్‌ టీజర్ విడుదల చేయగా.. అందులో రజనీకాంత్‌ గతంలో నటించిన ‘తంగమగన్‌’లోని ‘వా వా పక్కమ్ వా’ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉపయోగించారు. ఇది తాను కంపోజ్‌ చేసిన పాట అని ఇళయరాజా పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా వాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యూజిక్‌ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు అనుమతి తీసుకోవాలని సన్‌ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసు పంపారు. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదంతా ఇళయరాజా ఇష్టం. ఆయన సంగీతంపై ఉండే మేధోపర హక్కుల గురించి ఆయనకు మాట్లాడే హక్కు ఉందని మర్చిపోకూడదు.
ఇక ఇప్పుడు కీరవాణి వంతు వచ్చింది. ఉద్యమ సమయంలో యావత్‌ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న నిర్వహించనున్న బహిరంగసభలో ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి.

ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించటం వివాదానికి మూలమైంది. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.

”జయ జయహే తెలంగాణ’ పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం’ అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై BRS నేత RS ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం తెలిపారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచాక.. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని RS ప్రవీణ్‌ ట్వీట్ చేశారు.

తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన.. కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో స్పందించారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు.

ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడం పట్ల ఆయన మద్దతుదారులు కూడా తమదైన వాదన వినిపిస్తున్నారు. 30ఏళ్లకు పైగా తన సంగీత ప్రస్తానాన్ని హైదరాబాద్లోనే కొనసాగిస్తున్న ఆస్కార్ విజేత కీరవాణి ఈ పాటను స్వరపరచడానికి అర్హుడని వారంటున్నారు. కళలకు, కళాకారులకు ప్రాంతీయతనా ఆయన ఏనాడు తన మూలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్లాలని ఆలోచన కానీ, ఆ దిశగా చర్యలు కానీ చేయలేదని చెబుతున్నారు.

కళకు, కళాకారులకు ప్రాంతీయత ఆపాదించరాదు అని కొంతమంది అంటున్నారు. అంతేకాదు కీరవాణికి తెలంగాణ ప్రాంత పాటలతోనూ అనుబంధం ఉందని పీపుల్స్ ఎన్కౌంటర్‌కు తెలంగాణ ప్రాంత నేపథ్యంతో అద్భుతమైన పాటలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ‘లాలూ దర్వాజా లస్కర్ బోనాల్ పండుగకొస్తనని’ రాకపోతివి అంటూ ఇప్పటికీ ఎవరూ మర్చిపోకుండా తెలంగాణ బాణీలో సాగిన పాట కీరవాణి చేసినదేనని చెబుతున్నారు.

ఏదేమైనా తెలుగులో ఎన్నో దశాబ్దాల నుంచి సంగీత దర్శకుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ గీతంతో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవాణికి అప్పగించి ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular