పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు అని ప్రపంచం మొత్తానికి తెలిసిది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ మీద భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రపంచ దేశాలకు సమాచారం ఇచ్చింది. పాక్ ఉగ్రవాద కవ్వింపు చర్యలను ఐరాస ముందు పెట్టింది.
పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వని అంతర్జాతీయ సమాజం
తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేసింది. దాడుల విషయంలో అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని… ఈ విషయంలో భారత్ పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇప్పటి వరకూ నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్ కే అని చెప్పినా.. భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి.. ఈ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే చైనా రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
ఉగ్ర క్యాంపులపై ప్రపంచ దేశాలకు సమాచారం ఇచ్చిన భారత్
ఉగ్రక్యాంపులపై దాడులు చేయడానికి ముందే… భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే.. అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే.. పాకిస్తాన్ పైనే ప్రపంచదేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు ఆయుధ సాయం కావాలంటే ఆయా దేశాలు చేయాల్సిందే. వాటి మాటను కాదని దాడులు చేస్తే సాయం ఆగిపోతుంది సరి కదా.. ఆంక్షలు కూడా విధించవచ్చు.
పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చిక్కుల్లో పడాల్సిందే
అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీపై సొంత దేశం నుంచి చీత్కరింపులు ఉంటాయి. చేతకాదా అని రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు. వారిని సంతృప్తి పరచడానికి అయినా పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే భారత భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే మళ్లీ వచ్చిన విమానాలు వెనక్కి వెళ్లడం దాదాపుగా అసాధ్యం .ఎందుకంటే భారత్ తన గగనతలంలోకి ..పాకిస్తాన్ వైపు నుంచి ఏది వచ్చినా కూల్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందుకే పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కష్టాలు ఎదురు కావడం ఖాయం కనిపిస్తోంది. ఉరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం అని ఆ దేశ పెద్దలు అనుకుంటే మంచిదని అంటున్నారు.