-ఐటీ వాహనంలో ఆసుపత్రికి
టాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థల కార్యాలయాలు, వారి ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు రెండో రోజులుగా ఐటీ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి మూవీస్ బడ్జెట్, కలెక్షన్స్, వారు ఐటీ శాఖకు కట్టిన పన్నులపై అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కార్యాలయంపై రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా నిర్మాతలు, వారి కుటుంబీకులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లను కూడా ఓపన్ చేసి తనిఖీలు చేస్తున్నారు.
కృష్ణానగర్‌లోని దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ రెయిడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్‌రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్‌పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు.. వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నిన్న దిల్‌రాజు భార్యతో బ్యాంక్ లాకర్లు తెరిపించిన అధికారులు.. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఓ పక్క ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే.. మరోపక్క అకస్మాతుగా దిల్‌రాజు తల్లి తీవ్ర అస్వస్తతతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం క్షీణించగా ఐటీ అధికారుల వాహనంలోనే హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు అధికారులు.