ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ
రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు
హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని..హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..ప్రజలకు అండగా ఉండాలని బీఆర్‌ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై కూడా బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్‌ఎస్ నేతలు అధినేత కేసీఆర్‌కు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కూడా బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.