- ప్రజలను కాపాడడంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు ముందంజ
- ఇప్పటికే మూడువేలకు పైగా బాధితులకు 180 పునరావాస కేంద్రాల్లో రక్షణ
- రాష్ట్రవ్యాప్తంగా 6 బృందాలు చురుగ్గా విధులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతుండడంతో పలు గ్రామాలు, కాలనీలు జలమయమవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లకు కొట్టుకుపోవడంతో జన జీవనం స్తంభించిపోయింది. దీంతోపాటు ఈ వరదల్లో చిక్కుకొని కొంత మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. మరికొందరు వరదల్లో చిక్కకున్నారు. ఇలా వారిని రక్షించ డానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు తమవంతు సాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అందులో భాగంగా ఎన్‌డిఆర్‌ఎఫ్, డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖలు సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
రెండు రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ప్రజలను ఆదుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మూడువేల పైచిలుకు ప్రజలను ఈ బృందాలు కాపాడడం విశేషం. ఇలా సాయం అందించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాయి. తాజాగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,662 మంది సురక్షితంగా కాపాడినట్లు ఫైర్, రెస్క్యూ అధికారులు వెల్లడించారు. కోదాడలో 450, ములుగులో 150 మంది, కామారెడ్డిలో 200 మందిని, మహబూబాబాద్, సూర్యాపేటలో 750 మందిని, మిగతా జిల్లాలోనూ పలువురిని కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 06 బృందాలు
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో తమ బృందాలను (ఎన్‌డిఆర్‌ఎఫ్) నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు వరద ప్రాంతాలను తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఈ ప్రత్యేక దళ నిరంతరం శ్రమిస్తోంది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు సంబంధించి 06 బృందాలు ఒక్కో బృందంలో (40 సుక్షితులైన సిబ్బంది)తో పాటు 1500ల మంది అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లాకు 03 బృందాలు, ములుగుకు 01, నిర్మల్ జిల్లాకు 01, హైదరాబాద్‌లో 01 బృందాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
దీంతోపాటు 25 బోట్‌లను కూడా ఈ బృందాలకు సాయంగా పంపించింది. వరదల్లో భాగంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఈ బృందాలు 180 పునరావాస కేంద్రాలకు తరలించాయి. వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన 180 పునరావాస కేంద్రాల్లో సుమారుగా 3,700ల మందికి తగిన వసతులను ఈ బృందాలు కల్పిస్తున్నాయి. ఈ పునరావాస కేంద్రాలను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌డిఆర్‌ఎఫ్, డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.
డిఆర్‌ఎఫ్ బృందాల్లో 360 నిపుణులు
రాష్ట్రానికి చెందిన డిఆర్‌ఎఫ్ బృందాల్లో 360 మంది పూర్తి శిక్షణ పొందిన నిపుణులు, 8 ఎల్‌ఎంవి బృందాలు తమ కార్యకలాపాలను చేపడుతున్నాయి. 2022లో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు సిరిసిల్ల పట్టణం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తినప్పుడు ఈ బృందం ప్రజలకు అండగా నిలిచింది.