Friday, November 15, 2024

రిజిస్ట్రేషన్లు డబుల్….ఆదాయం ఏడింతలు

  • 2014- 15లో 2,746 కోట్లు..2023 -24లో రూ.14,588 కోట్లు
  • అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే..అత్యల్పంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వార్షిక నివేదికలో వెల్లడి

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేండ్లలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయి. 2014- 15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,746 కోట్లు ఉంటే 2023 -24కు వచ్చేసరికి రూ.14,588 కోట్లకు చేరింది. ఒక్క కరోనా ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాది ఆదాయంలో వృద్ధి కనిపించింది. అదే డాక్యుమెంట్ల విషయానికి వస్తే అప్పుడు 8.27 లక్షలు రిజిస్ట్రేషన్ కాగా గతేడాదికి ఆ మొత్తం 18.41 లక్షలకు చేరాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్‌మెంట్ వార్షిక నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం పోయిన ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అంతకు ముందు సంవత్సరం (2022 -23)తో చూస్తే అగ్రికల్చర్ డాక్యుమెంట్లు లక్ష మేర తగ్గాయి.

 

అదే నాన్ అగ్రికల్చర్ విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు. గత ఏడాది నాన్ అగ్రికల్చర్లో ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్లు చేశారు. మొత్తంగా 10.50 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షలు ఓపెన్ ప్లాట్లవి కాగా 1.03 లక్షలు ఇండ్లకు, ఫ్లాట్లకు 94,884, ఇక అగ్రికల్చర్‌లో 4.60 లక్షల సేల్ డీడ్స్ చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్‌లో ఉంది. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2023 -24లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి రూ.4798 కోట్లు వచ్చాయి.

ఇక అత్యల్పంగా ఆదాయం వచ్చిన దాంట్లో రూ.13 కోట్లతో కుమరం భీమ్ ఆసిపాబాద్ జిల్లా ఉంది. గత ఏడాది ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద రూ.7476 కోట్లు వచ్చింది. ఎక్కువ ఆదాయం వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లలో ఫస్ట్ రంగారెడ్డి ఎస్‌ఆర్‌ఓ ఉన్నది. ఆ తరువాత గండిపేట నిలిచింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నది. ముందు మహారాష్ట్ర ఉండగా ఆ తరువాత కర్నాటక, తమిళనాడు ఉన్నాయి. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఏపీలో వచ్చినట్లు నివేదికలో వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular