క్యూలైన్ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణం
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న బాధితులు తరలివచ్చారు. అయితే, చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన కాసేపటికే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేప మందు ప్రసాదం కోసం పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో క్యూలైన్‌లలో తోపులాట జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57) ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉండగా.. రద్దీ పెరిగి క్యూలైన్‌లో జరిగిన తోపులాటతో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన సిబ్బంది అతన్ని హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు. శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం.. 24 గంటల పాటు సాగనుంది.
ఈ కార్య్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ చేప ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవటం వల్ల ఆసమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపశమనం దొరుకుతుందని ప్రజల నమ్మకం. ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు.. వేల సంఖ్యలో జనాలు నాంపల్లి గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ మొదటి వారంలో వచ్చే ‘మృగశిర కార్తె’ రోజున బత్తిని కుటుంబ సభ్యులు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం 500 కిలోలకుపైగా ప్రసాదం తయారవుతుంది.
ఉబ్బసం ఉన్నవారు ఈ చేప ప్రసాదాన్ని వరుసగా మూడేళ్లు తీసుకుంటే.. ఆ సమస్య నుంచి పూర్తి ఉపశమం పొందుతారని నమ్ముతారు. అయితే.. శాకాహారులకు ఈ ప్రసాదాన్ని బెల్లంతో కలిపి ఇస్తారు. గత 178 సంవత్సరాలుగా ఈ ఔషధాన్ని బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేప మందుకు సంబంధించిన రహస్య సూత్రాన్ని 1845లో ఒక సాధువు తమ పూర్వీకులకు అందించారని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ, రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా చేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నారని చెప్పారు. శతాబ్ధ కాలంపైగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణి చేస్తున్నారని చెప్పారు. ఆస్తమా, శ్వాస సంబంధ రోగులు ఈ చేప ప్రసాదాన్ని వేసుకుంటున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాలతోపాటు పలు దేశాలనుంచి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందరన్నారు.