డీఎంకే పార్టీ పై నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని ప్రముఖ నటి, అన్నాడీఎంకే విధాన ప్రచార ఉపకార్యదర్శి గౌతమి ఆరోపించారు. నటుడు సత్యరాజ్ కుమార్తె డీఎంకేలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరు ఏ పార్టీలోనైనా చేరొచ్చని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమని అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడీఎంకే అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంజీఆర్ తీసుకొచ్చిన పౌష్టికాహార పథకం ప్రపంచ ప్రసిద్ధి చెందిందని గౌతమి పేర్కొన్నారు. జయలలిత తన హయాంలో తాళికి తంగం, ఉచిత ల్యాప్‌టాప్, ద్విచక్ర వాహనాలకు రాయితీ తదితర పథకాలు అమలు చేశారని తెలిపారు. పళనిస్వామి హయాంలోనూ పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ఎంజీఆర్ 108వ జయంతి సందర్భంగా చెన్నై ఉత్తర తూర్పు జిల్లా తరపున నిన్న సమావేశం, సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన గౌతమి వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం లేపుతున్నాయి.