ఈ రోజుల్లో ఒక్క భార్యతోనే కుటుంబాన్ని నిర్వహించడం కష్టం. సినిమాల్లో హీరోయిన్ ను తీక్షణంగా చూసినా ఆ భార్య అసలు ఒప్పుకోదు. అలాంటిది ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో జీవించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇద్దర్ని ప్రేమించిన ఓ యువకుడు ఈ రిస్క్ తీసుకోవాలని డిసైడయ్యాడు. అనుకున్న విధంగా అన్ని కుటుంబాలను ఒప్పించి ఒకే మండపంలో ఇద్దర్నీ పెళ్లి చేసేసుకున్నాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. సిడాం సూర్యదేవ్ అనే వ్యక్తి లాల్దేవి, జలకర్ దేవి అనే ఇద్దరిని ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరు యువతులకు విషయం చెప్పి, వారి సమ్మతితో ఇద్దర్ని పెండ్లి చేసుకున్నాడు. వారితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు సైతం సమ్మతివ్వడంతో ఆ పెండ్లికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
అదే సమయంలో ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని, బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో ఆ ముగ్గురు వివాహ బంధంతో ఏకమయ్యారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెండ్లికి మూడు గ్రామాల ప్రజలతో పాటు, వరుడు, ఇద్దరు వధువుల తరుపు పెద్దలు హాజరయ్యారు. ఆదివాసి సంప్రదాయాలతో డోలు వాయిద్యాల నడుమ ఘనంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు బంధు మిత్రులు పెళ్లికి హాజరై ఈ కొత్త జంటలనూ ఆశీర్వదించారు. మామూలుగా అయితే ఇలా ఇద్దర్ని పెళ్లి చేసుకోవడం నేరం. చట్ట విరుద్ధం కూడా. అయితే గిరిజనులు పెళ్లిళ్లను తమ సంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారమే నిర్వహించుకుంటారు. ఏమైనా సమస్యలు వచ్చినా పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ చేసుకుని పరిష్కారాలు చేసుకుంటారు. అందుకే గిరిజనులు కుటుంబాల్లో అప్పుడప్పుడు బహు భార్యత్వం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల.. గిరిజనుల్లో ఓ మహిళ ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆదిలాబాద్ లోని గిరిజన ప్రాంతాల్లో ఇలా ఒకరికి ఇద్దరు భార్యలు ఉండటం అనేది సహజమన్న అభిప్రాయం ఉంది.
అయితే ఇది అన్ని గిరిజన తెగలకూ ఒకేలా ఉండదు. కొన్ని గిరిజన తెగలు బహుభార్యత్వాన్ని ఆచరిస్తుండగా, మరికొన్ని ఏకభార్యత్వాన్ని పాటిస్తూంటాయి. కొన్ని గిరిజన సమాజాల్లో, బహుభార్యత్వం సాంప్రదాయంగా ఉంది. రిజన తెగల్లోని ఆచారాలు, సంప్రదాయాలన్ని దాదాపుగా సంప్రదాయ చట్టాల పర్యవేక్షణలో ఉంటాయి. అవే గిరిజనులకు గుర్తింపు. ఈ ప్రత్యేకత మూలంగానే కుల, మత వర్గాల నుంచి గిరిజనులు వేరుగా ఉంటారని అనుకోవచ్చు. అయితే రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కుకు ఎలాంటి భంగం వాటిల్లకూడదు. ముఖ్యంగా మహిళల అంశంలో అది కచ్చితంగా అనుసరించాల్సి ఉంది. కానీ వారు తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లకు వస్తేనే కేసులు నమోదు చేస్తారు.