Thursday, May 15, 2025

పాకిస్థాన్‌పై అనుమానాలున్నాయి

అణ్వాయుధాల భద్రతపై ఇంకా డౌట్సే : రక్షణ మంత్రి రాజ్​నాథ్​

పాకిస్థాన్‌ అణు బెదిరింపులకు బెదిరేది లేదని భారత్‌ స్పష్టం చేసిందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పాకిస్థాన్‌లో అణ్వాయుధాల భద్రతపై అనుమానం ఉందన్న ఆయన, వాటిపై అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని తెలిపారు. ఆదేశ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేసి ముష్కరమూకలకు భారత్‌ తగిన గుణపాఠం చెప్పిందని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి రక్షణమంత్రి జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అమరులైన సైనికులకు రాజ్‌నాథ్‌సింగ్‌ శ్రీనగర్‌లో నివాళులర్పించారు. సైనిక బలగాలతో ముచ్చటించిన రక్షణమంత్రి, ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులను కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామీ బాఘ్‌ కంటోన్మెంట్‌ వద్ద జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో కలిసి భారత్‌ తుక్కుచేసిన పాక్‌ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు

తద్వారా దేశ ప్రజలను విడదీయాలని చూశారు
బాదామీ బాఘ్‌ కంటోన్మెంట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగించారు. పహల్గాంలో మతం అడిగి మరీ పర్యటకులను చంపారనీ తద్వారా దేశ ప్రజలను విడదీయాలని చూశారని తెలిపారు. ముష్కరుల దుశ్చర్యలకు ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వారిని తుదముట్టించిన భారత సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రశంసించారు. ఇకపై ఉగ్ర దాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రక్షణమంత్రి, మనం దాడి చేసిన తీరును శత్రువు ఎప్పటికీ మరువడని తెలిపారు.
“పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన జమ్ముకశ్మీర్ ప్రజలకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. శత్రువులను నాశనం చేసిన శక్తిని అనుభూతి చెందేందుకు నేను ఇక్కడకు వచ్చాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు నాశనం చేసిన విధానాన్ని శత్రువు ఎప్పటికీ మరచిపోలేడు”
‘పాకిస్థాన్‌ అణు బెదిరింపులకు భారత్‌ భయపడదు. భారత్‌పై అణు దాడి చేస్తామంటూ పాకిస్థాన్‌ చేసిన బెదిరింపులను యావత్‌ ప్రపంచం అనేకసార్లు చూసింది. ఇప్పుడు శ్రీనగర్‌ సాక్షిగా నేను ప్రపంచాన్ని అడగాలనుకుంటున్నాను. ఒక బాధ్యతారహితమైన దుర్మార్గపు దేశపు చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా ? పాకిస్థాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను’ అని రాజ్​నాథ్ చెప్పారు. బాదామీ బాఘ్‌ కంటోన్మెంట్‌ వద్ద సైనికులతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్‌, ఒమర్‌ అబ్దుల్లా, మనోజ్‌ సిన్హా భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com