మంత్రి శ్రీధర్ బాబు కంది ఐఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భారత విజ్ఞాన పరిశోధనా సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్‌లో డ్రైవర్ లెస్ వెహికిల్‌లో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. అంతకుముందు ఐఐటీ పరిశోధన సంస్థ పని తీరు గురించి మంత్రి శ్రీధర్ బాబు డైరెక్టర్ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్ లెస్ వెహికిల్‌లో ప్రయాణం చేశామని, అక్కడి కంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణంగా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను తమ సహచరులతో మాట్లాడి, అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునే విధంగా చూస్తామన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటామని మంత్రి వెల్లడించారు.