- వచ్చే అయిదేళ్లలో డ్రోన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు
- డ్రోన్ రంగ భవిష్యత్తుపై తయారీదారుల్లో పెరిగిన విశ్వాసం
- మేధస్సుకు కొదవ లేదు.. పెట్టుబడుల పరంగా సవాళ్లు
- డ్రోన్ రంగ స్కిల్ డెవలప్‌మెంట్‌పైనా ప్రత్యేక దృష్టి
- అమరావతి డ్రోన్ సమ్మిట్-2024లో వక్తల అభిప్రాయాలు
- విజయవంతంగా ముగిసిన రెండు రోజుల సదస్సు
- సదస్సు విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున
ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్
విజయవాడ: డ్రోన్ టెక్నాలజీ రంగంలో దేశానికి దశ దిశను నిర్దేశించేలా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రాన్ని దేశ డ్రోన్ రాజధానిగా మార్చాలనే ఆయన ఆకాంక్షకు అనుగుణంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 బుధవారం విజయవంతంగా ముగిసింది. డ్రోన్ టెక్ నవ ఆవిష్కరణలకు ఈ సదస్సు గొప్ప ముందడుగు అని, వచ్చే అయిదేళ్లలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సదస్సులో పలువురు వక్తలు స్పష్టం చేశారు.
సదస్సుతో డ్రోన్ మ్యానుఫ్యాక్చర్లలో విశ్వాసం ఇనుమడించిందని.. ఈ ఊపుతో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), డ్రోన్ యూజ్ కేసుల రూపకల్పన, వివిధ రంగాల్లో వినియోగం తదితరాల్లో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ భారత్‌లో మేధస్సుకు కొదవలేదని.. అయితే పెట్టుబడుల పరంగా సవాళ్లు ఉన్నాయని.. వాటిని ఎదుర్కొనేలా, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్న భరోసా సదస్సు ద్వారా లభించిందని పేర్కొన్నారు.
సవాళ్లను ఎదుర్కొనేలా మేధోమథనం:
మంగళవారం గౌరవ ముఖ్యమంత్రి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో రెండో రోజు బుధవారం డ్రోన్ రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ప్యానళ్లు విస్తృతంగా చర్చించాయి. ఐఐటీ మద్రాస్ డిఫెన్స్ డ్రోన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ హెచ్ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వార్‌ఫేర్ విత్ ఇండీజినస్ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్‌పై ప్రభావవంతమైన చర్చ జరిగింది. అదే విధంగా హంచ్ మొబిలిటీకి చెందిన అమిత్ దత్తా నేతృత్వంలో భారతీయ డ్రోన్ రంగంలో పెట్టుబడుల పరంగా సవాళ్లపై చర్చ జరగ్గా.. రెడ్వింగ్ ల్యాబ్స్ కో-ఫౌండర్ అన్షుల్ శర్మ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో ఏరియల్ మెడికల్ సపోర్ట్, డ్రోన్ అంబులెన్సులు తదితరాలపై చర్చ జరిగింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డా. జి.లక్ష్మీశ చర్చల్లో పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీస్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో, డ్రోన్ సాంకేతికతల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్టార్టప్‌లకు ఫండింగ్‌కు సంబంధించి అమలవుతున్న విధానాలను వివరించారు. అదే విధంగా మారుమూల గ్రామాల ప్రజలు, గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో డ్రోన్ సాంకేతికతల అనుసంధాన సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. డిజిటల్ భూ రికార్డుల రూపకల్పనలో డ్రోన్ సాంకేతికత వినియోగంపై ప్రకాశం జిల్లా జేసీ రోణంకి గోపాలకృష్ణ కీలక ప్రసంగం చేశారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా నేతృత్వంలో డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరుల అభివృద్ధిపై చర్చ జరిగింది.
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్, ఎండీ కె.దినేష్ కుమార్.. ఇటీవల విజయవాడ వరదల సమయంలో బాధితులకు ప్రభుత్వం అందించే సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం విజయవంతం కావడంపై కీలక పీపీటీని ప్రజెంట్ చేశారు. విపత్తుల నిర్వహణలో డ్రోన్ సాంకేతికతపై దార్శనికతను ఆవిష్కరించారు. వరద మ్యాపింగ్, పర్యవేక్షణ, ముంపు నష్టాల సత్వర అంచనా, ఆహారం, ఇతర సామగ్రి సరఫరా, పారిశుద్ధ్య కార్యకలాపాల్లో డ్రోన్లను వినియోగించిన తీరును వివరించారు. 437 డ్రోన్లు, 846 మంది సిబ్బంది, 4,073 ట్రిప్పుల ద్వారా ప్రజలకు అందించిన సేవలను వివరించారు.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు:
గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో అమరావతి డ్రోన్ సదస్సు-2024ను విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగస్వాములైనవారిని ఘనంగా సత్కరించారు.