Monday, July 8, 2024

గల్లీగల్లీలో డ్రగ్స్​ వాడకం పెరిగింది

  • మత్తు మహమ్మారితో కుటుంబ వ్యవస్థ నాశనం

ప్రతి సినిమా విడుదల సమయంలో ఆ నటీనటులతో డ్రగ్స్​కు వ్యతిరేకంగా షార్ట్​ ఫిలీం ప్రతి సినిమా థియోటర్​లో సినిమాకు ముందు డ్రగ్స్​ నియంత్రణ, సైబరల్​క్రైంకు సంబంధించిన సీఎం రేవంత్​ రెడ్డి ప్రస్తుతం స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న అతి పెద్ద స‌మ‌స్యలు సైబ‌ర్ నేరాలు, మాద‌క ద్రవ్యాలేన‌ని సీఎం రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక‌ప్పుడు హ‌త్య, అత్యాచారాలు పెద్ద నేరాలుగా ఉండేవ‌ని, హ‌త్యతో ఒక‌రే చ‌నిపోతార‌ని, కానీ మాద‌క ద్రవ్యాల (డ్రగ్స్‌) ప్రభావంతో ఒక త‌రం ప‌నికిరాకుండాపోతుంద‌న్నారు. దురదృష్టవ శాత్తు గల్లీగల్లీలో డ్రగ్స్ వాడకం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మత్తు మహమ్మారితో కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నివారణకు తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.

నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం
సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 ద్విచ‌క్ర వాహ‌నాలు, యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు (టీజీ న్యాబ్‌) 27 కార్లు, 59 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను కేటాయించిన వాహనాలను రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉద్యమాల‌కు చిరునామా అయిన రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించ‌కూడ‌ద‌ని పోలీసు అధికారుల‌కు సూచించారు. గ‌త ప్రభుత్వ ప‌దేళ్ల నిర్లక్ష్యంతో గంజాయి వినియోగం గ‌ల్లీగ‌ల్లీలో పెరిగిపోయింద‌ని, క‌ళాశాల‌ల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ గంజాయి అమ్మకాలు సాగుతున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఉన్నత వ‌ర్గాల వారే కాకుండా పేద‌లు, మ‌ధ్యత‌ర‌గ‌తి వారు సైతం గంజాయికి బానిస‌లు అవుతున్నార‌ని, ఇటీవ‌ల హ‌త్యలు, చిన్న పిల్లల‌పై దాడులకు కార‌ణ‌మైన వారిని ప‌రిశీలిస్తే వారిలో అత్యధికులు గంజాయికి బానిస‌లైన‌వారిన‌నే తేలింద‌న్నారు. డ్రగ్స్‌, సైబ‌ర్ నేరాల సంఖ్య పెర‌గ‌డంతో వాటిని ఎదుర్కోవ‌డానికి అవ‌స‌ర‌మైన నిధులు, అధికారుల‌ను పోలీసు శాఖ‌కు కేటాయించామ‌న్నారు. ఆధునిక కాలంలో అందివ‌చ్చిన సాంకేతిక‌త‌ను, నైపుణ్యాల‌ను నేర‌గాళ్లు వినియోగించుకుంటున్నార‌ని, వారిని ఎదుర్కోవాలంటే అంత‌కుమించిన నైపుణ్యాలు, సాంకేతిక‌త‌ను పోలీసులు అందిపుచ్చుకోవాల‌ని
సీఎం సూచించారు.

సైబ‌ర్ మోసాలు, డ్రగ్స్ బారిన కేవ‌లం అమాయ‌కులు, పేద‌లే కాకుండా ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సైతం ప‌డుతున్నార‌న్నారు.కొద్ది కాలంలోనే సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో రూ.31 కోట్లను నేర‌గాళ్ల నుంచి రాబ‌ట్టి బాధితుల‌కు అంద‌జేసింద‌ని, అందులో భాగ‌స్వాములైన సిబ్బందికి ఆయన అభినంద‌న‌లు తెలిపారు.

వాళ్లకే ప్రమోషన్లు.. అసెంబ్లీలో చట్టం
గ‌తంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరాటం చేసిన వారికి, ఆ నేరాలు అరిక‌ట్టిన వారికి ప్రమోష‌న్లు ఇచ్చేవార‌ని, ప్రస్తుతం సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్ స‌ర‌ఫ‌రాను అరిక‌ట్టడంలో స‌మ‌ర్థంగా ప‌ని చేసిన పోలీసు సిబ్బందికి ప్రమోష‌న్లు ఇచ్చే బాధ్యత త‌మ ప్రభుత్వం తీసుకుంటుంద‌ని స్పష్టం చేశారు. సైబ‌ర్ నేరాగ‌ళ్లను ప‌ట్టుకున్న వారిని, సైబ‌ర్ నేరాలు అడ్డకున్నవారికి, డ్రగ్స్ స‌ర‌ఫ‌రాను అడ్డుకున్న వారిని, డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేసే వారిని ప‌ట్టుకున్న వారికి ప్రమోష‌న్లు క‌ల్పించే విధివిధానాలు త‌యారు చేయాల‌ని డీజీపీ ర‌విగుప్తాను సీఎం ఆదేశించారు. దానిపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి సంబంధిత చ‌ట్టం చేస్తామ‌ని వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే పోలీసులు బాధితులతో ఉండాల‌ని, నేర‌గాళ్లతో కాద‌ని సీఎం చురకలంటిచారు.

అలా చేస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంపు
డ్రగ్స్‌తో క‌లిగే న‌ష్టాల‌పై ఇటీవ‌ల ప్రముఖ న‌టుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపార‌ని, ఆయ‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు. చిరంజీవిని ఇత‌ర న‌టులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రతి సినిమా ప్రద‌ర్శన‌కు ముందు ఆ సినిమాలో న‌టించే తారాగ‌ణంతో సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఒక‌టిన్నర లేదా రెండ నిమిషాలు నిడివి ఉండే వీడియోల‌ను తీసి ఉచితంగా ప్రద‌ర్శించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా థియేట‌ర్లలోనూ ఈ రెండు ర‌కాల వీడియోల‌ను ఉచితంగా ప్రద‌ర్శించాల‌ని థియేట‌ర్ య‌జ‌మానుల‌కు సీఎం సూచించారు.

సినిమా అనేది రూ.వంద‌ల కోట్ల పెట్టుబ‌డితో చేసే వ్యాపార‌మ‌ని, వారి వ్యాపారాన్ని తాము కాద‌న‌మ‌ని, కానీ అదంతా ప్రజ‌ల నుంచే వ‌చ్చేద‌నే విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు డ్రగ్స్‌, సైబ‌ర్ నేరాల అవ‌గాహ‌న వీడియోలు ప్రద‌ర్శిస్తేనే సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపు, ఇత‌ర అనుమ‌తులు ఇస్తామ‌ని తేల్చిచెప్పారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. మీడియా సైతం రాజ‌కీయ వివాదాల‌పై కాకుండా సామాజిక స‌మ‌స్యల‌పైనా దృష్టిసారించాల‌ని హిత‌వుప‌లికారు. డ్రగ్స్‌, సైబ‌ర్ నేరాల‌పై టీవీలు, ప‌త్రిక‌ల్లో అప్పుడ‌ప్పుడు ఉచితంగా ప్రక‌ట‌న‌లు వేయాల‌ని ఆయన సూచించారు. మీడియా సామాజిక బాధ్యత‌గా ఈ అంశాన్ని ప‌రిగ‌ణించాల‌ని ఆయ‌న కోరారు.

రాజకీయ వ్యవస్థపై మితిమీరిన భ‌ద్రత వ‌ద్దు
రాజ‌కీయ వ్యవ‌స్థపై నిఘా త‌గ్గించి నేరాల‌పై నిఘా పెట్టి నేర‌గాళ్లను ప‌ట్టుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స‌మాజంలో ఉన్న ప్రజ‌లు ఎన్నుకుంటేనే తాము ప్రజా ప్రతినిధులుగా వ‌చ్చామ‌ని, త‌మ‌కు మితిమీరిన సెక్యూరిటీ అవ‌స‌రం లేద‌న్నారు. ఎవ‌రికి ఎంత అవ‌స‌ర‌మో అంతే సెక్యూరిటీ ఇవ్వాల‌ని, భ‌ద్రత విష‌యంలో త‌న‌తో స‌హా ఎవ‌రికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌సరం లేద‌ని డీజీపికి స్పష్టం చేశారు. భ‌ద్రత‌, ఇత‌ర విష‌యాల్లో కొన్ని సార్లు పోలీసుల అతి ఉత్సాహం చూపుతార‌ని, ఆ ఉత్సాహం, శ‌క్తి నేరాల నియంత్రణ‌పై చూపాల‌ని సూచించారు. పోలీసు కుటుంబాల పిల్లలు రాణించ‌లేర‌నే అప‌వాదు స‌మాజంలో ఉంద‌ని, ఇందుక ప్రధాన కార‌ణం విధుల్లో ప‌డి కుటుంబాల‌కు, పిల్లల‌కు స‌రైన స‌మ‌యం కేటాయించ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌న్నారు. అందుకే సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించారు.

గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎక‌రాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామ‌ని, ఆరు నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందులో ఉంటుంద‌ని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వ‌ర‌కు చ‌దువుకోవ‌చ్చని తెలిపారు. పోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వ‌చ్చామ‌ని చెప్పుకునేందుకు ఇబ్బంది ప‌డ‌తార‌ని, అందుకు కార‌ణం పోలీసు శాఖ‌పై స‌మాజంలో ఉన్న అభిప్రాయ‌మేన‌ని సీఎం అన్నారు. ఆ అభిప్రాయం మారాల‌ని, త‌న తండ్రి, త‌న అన్న పోలీసు అని గ‌ర్వంగా చెప్పుకునేలా మ‌న ప్రవ‌ర్తన ఉండాల‌ని, త‌న అన్న భూపాల్ రెడ్డి వ‌న‌ప‌ర్తిలో కానిస్టేబుల్ గా ప‌ని చేసి త‌న‌ను చ‌దివించార‌ని, త‌న అన్న పెంప‌కంతోనే తాను ఈ రోజు ఈ స్థాయికి వ‌చ్చాన‌ని వెల్లడించారు.

తాను సీఎంగా ఉన్నప్పుడే పోలీసు శాఖ స‌మ‌స్యలు ప‌రిష్కరించుకోకుంటే జీవిత‌కాలంలో అవి ప‌రిష్కారం కావ‌న్నారు. ఇక, తెలంగాణ బ్రాండే హైద‌రాబాద్ అని, హైద‌రాబాద్ పోలీసు అంటే తెలంగాణ‌కు గుండెకాయ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న‌గ‌రంలో నేరాల‌ను నియంత్రించ‌క‌పోతే, అరాచ‌కాల‌ను అరిక‌ట్టక‌పోతే రాష్ట్రానికి తీవ్రమైన న‌ష్టం వాటిల్లుతుంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అంతా త‌మ బాధ్యత‌ను ప్రతి రోజు గుర్తుపెట్టుకొని హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజిని కాపాడాల‌ని ఆయ‌న కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular