భూవివాదంలో కొమ్ముకాసి వారికి సహకరించినందుకు ఇదివరకు తూప్రాన్ డీఎస్పీగా పనిచేసిన యాదగిరి రెడ్డి, శివ్వంపేట ఎస్సైగా పనిచేసిన రవికాంత రావులను కోర్టు ధిక్కార నేరంలో హై కోర్టు దోషులుగా నిర్ధారించి జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…. కరుణాకర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులకు శివ్వంపేట మండలం సికిండ్లాపూర్ లో 50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని విల్లా ప్రాజెక్ట్ గా డెవలప్మెంట్ కోసం మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంలో మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఆ భూమిని అభివృద్ధి చెయ్యక పోవడంతో, ఇరు పక్షాల మధ్య వివాదం నెలకొంది.
ఈ వివాదంలో మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ అయిన జి.సందీప్, నిఖిల్ రెడ్డి లు దౌర్జన్యంగా కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన భూమిలో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితులు శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, శివంపేట ఎస్సై రవికాంత రావు మెస్సర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ జి.సందీప్, నిఖిల్ రెడ్డి లకు సహకరించడమే కాకుండా సివిల్, భూ వివాదంలో తలదూర్చి అక్రమార్కులకు సహకరించడంతో పాటు, కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు హై కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ కేసులో కోర్టు ఏప్రిల్ 25న స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. కాగా ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తరువులు అమలులో ఉండగా, మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ అయిన జి.సందీప్, నిఖిల్ రెడ్డి దౌర్జన్యంగా కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన భూమిలో అక్రమంగా చొరబడేందుకు ప్రత్నించారు.
ఈ క్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, శివంపేట ఎస్సై రవికాంత రావు మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ జి.సందీప్, నిఖిల్ రెడ్డి లకు సహకరించడమే కాకుండా సివిల్/ భూ వివాదంలో తలదూర్చి అక్రమార్కులకు సహకరించినట్లు తేలింది. కోర్ట్ ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగా అతిక్రమించడమే కాకుండా, వివాదం వున్న భూమిలో, మామిడి తోటలో దౌర్జన్యంగా ప్రవేశించి, మామిడికాయలు దోచుకుని వెళ్లిన సంఘటనలో నేరస్తులకు సహకరించినట్టు గుర్తించారు.
న్యాయాన్ని కాపాడవలసిన పోలీసులు నేరస్తులకు సహకరించడమే కాకుండా, కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేయడంపై కరుణాకర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు హై కోర్టులో, కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తిచేసిన కోర్టు బుధవారం సంబంధిత పోలీస్ అధికారులు కోర్ట్ ధిక్కారానికి పాల్పడినట్లు నిర్దారించి రెండు వేల చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్ట్ ధిక్కార నేరంలో మెస్సేర్స్ ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ అయిన జి.సందీప్, నిఖిల్ రెడ్డి లకు ఒక నెల జైలు శిక్ష, యాభై వేల జరిమానా విధించింది.