ఏడుగురు నవజాత శిశువులు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని చిన్నపిల్లల దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ దవాఖానలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అర్థరాత్రి దాటిన తర్వాత దవాఖానలో అగ్నిప్రమాదం జరిగిన్నట్లు తమకు ఫోన్ వచ్చిందని ఫైర్‌సేఫ్టీ అధికారి రాజేశ్ తెలిపారు. వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నామని, దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. రెండు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిలో ఒకటి హాస్పిటల్ కాగా, మరొకటి దాని పక్కనే ఉన్న భవనని వెల్లడించారు. 12 మందిని రక్షించి వారిని దవాఖానకు తరలించామని, సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.