- సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు జారీ
- ఈనెల 27న విచారణకు రావాలనీ నోటీసులో పేర్కొన్న ED
- ప్రమోషన్ కింద 5.9 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణ
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేశ్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గత వారం రెండు రోజుల పాటు ఈ సంస్థల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.
కంపెనీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేశ్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో, 2.5 కోట్ల రూపాయల ఆర్‌జీఎస్ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనకు చెల్లించిన ఈ రెమ్యునరేషన్‌పై ఈడీ ఆరా తీయనుంది. కాగా, మహేశ్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కే సతీశ్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా తదితరులు కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాటును పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు ఉన్నాయి.
ఇక, మహేశ్.. సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలా మంది ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ స్కామ్‌లో మహేశ్ బాబు నేరుగా పాల్గొనకపోయినా, ఆయనకు అందిన నగదుపై ఈడీ ఆరా తీస్తోంది.