- తాజాగా మరో భూకుంభకోణం ఫిర్యాదు
- రూ.1000 కోట్ల విలువ చేసే భూమి
- మాయం చేశారని బాధితుల ఫిర్యాదు
- ౩ వ రోజు కూడా కొనసాగిన విచారణ
ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఇడి ఉచ్చు బిగసుకుంటోంది. తాజాగా ఆయనపై మరో ఫిర్యాదు ఇడికి అందింది. ఇప్పటివరకు అమోయకుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కంటే తాజాగా అందిన ఫిర్యాదు వెనుక భారీ భూ కుంభకోణం ఉందని,ఇందులో పెద్దతలకాయల పాత్ర ఉందనే ప్రచారం జరుగుతున్నది. కాగా అమోయ్‌కుమార్ మూడవ రోజు కూడా ఇడి ముందు హాజరయ్యారు. తాజాగా ఆయనపై వచ్చిన భూ కుంభకోణ దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేస్తుందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. వీరు చెప్పెదాంట్లో వాస్తవం ఉన్నట్టు అయితే భూదందాలలో అమోయ్‌కుమార్ పీకలలోతు దాగా కూరుకుపోయినట్టేనని చెబుతున్నారు.ఇప్పటికే ఆయనపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం వట్టినాగుల పల్లితో పాటు కాజాగూడా లోని పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పన్నంగా అప్పగించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం నిషేదిత జాబితాలో పెట్టిన భూములను కూడా ఆయన ఇతరులకు బదలాయించడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ఇడి విచారణ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇవ్వే కాకుండా తాజాగా మధురానగర్ కాలనీ ఆసొసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఇడి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు. మున్ముందు ఈ కేసును కూడా ఇడి చేపట్టే అవకాశం ఉండటంతో ఆమెయ్‌కుమార్ మరింత ఊబిలో పడిపోయినట్టేనని అంచనా వేస్తున్నారు. నాలుగు రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు లబ్ధి చేకూర్చేలాగా అమోయకుమార్ భూముల కేటాయింపు జరిపాడని తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల 840 మంది కొనుగోలు చేసిన ఫ్లాట్స్ కోల్పోవలసి వచ్చిందని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ అధ్యక్షుడు రాగిడి లక్మారెడ్డి ఆరోపించారు.
అమెయ్‌కుమార్ కలెక్టర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్లాట్ ఓనర్స్‌ను మోసం చేయడంతో వారంతా బజారునపడ్డారని ఆయన తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో సైతం ప్లాట్ ఓనర్ల పేర్లు ఉన్నప్పటికీ అక్రమంగా ధరణిలో ఇతరుల పేర్లపైకి బదులాయించినట్టు ఆయన ఆరోపించారు. ఇడి అయినా తమ ఫిర్యాదు పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరినట్టు లకా్ష్మరెడ్డి తెలిపారు. ఇప్పటికే తాము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. అమోయ్ కుమార్‌పై ప్రస్తుతం ఇడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును సైతం పరిగణలోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ భూముల బదలాయింపుల వెనక గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలో కూడా ఇడి విచారణ జరిపే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
అమోయ్ కుమార్‌పై ఇడి ప్రశ్నల వర్షం
అమోయ్ కుమార్‌ను మూడోరోజు కూడా ఇడి అధికారులు విచారించారు. ఇడి కార్యాలయానికి శుక్రవారం ఉదయం 9 గంటలకు అమోయ్‌కుమార్‌ను హాజరుకాగా దాదాపు 8 గంటల పాటు విచారణ కొనసాగింది. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 181,182 భూములపై విచారించినట్టు తెలిసింది. సుమారు 70 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతంపై ఇడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు గతంలో కలెక్టర్ గా పని చేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములతోపాటు, భూదాన్ భూములను గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకుఇతరుల పేర్లపైకి బదలాయించినట్టు అమోయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయా జిల్లాలలోని రైతులను బెదిరించి వారి భూములను బలవంతంగా లాక్కున్నారని పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇడి రంగంలోకి దిగి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.